Telugu Global
Andhra Pradesh

తెరపైకి రెడ్ బుక్.. లోకేష్ కామెడీ మళ్లీ మొదలైందా..?

"ప్రభుత్వం మారిన వెంటనే రెడ్ బుక్ లోని వారికి బదులు తీర్చే బాధ్యత నేనే తీసుకుంటా. అకారణంగా 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయన మర్చిపోయినా.. నేను మర్చిపోను." అంటూ అనకాపల్లిలో జరిగిన యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో స్టేట్ మెంట్ ఇచ్చారు లోకేష్.

తెరపైకి రెడ్ బుక్.. లోకేష్ కామెడీ మళ్లీ మొదలైందా..?
X

రెడ్ బుక్ తెచ్చుకున్నాను, అందులో పోలీసుల వివరాలన్నీ రాసుకుంటున్నానంటూ యువగళం యాత్రలో తెగ హడావిడి చేశారు నారా లోకేష్. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే చంద్రబాబు జైలుకెళ్లారు. అయితే ఇప్పుడు మళ్లీ లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఆ పుస్తకంలో టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టుకున్నవారి వివరాలన్నీ రాసుకున్నానని చెప్పారు. ఆ పుస్తకాన్ని యువగళం ముగింపు సందర్భంగా చంద్రబాబుకి అందిస్తానన్నారు.

ప్రజా సమస్యలు పట్టవా..?

రెడ్ బుక్ లో తమను ఇబ్బంది పెట్టిన వారి వివరాలు కాకుండా, ప్రజా సమస్యలను లోకేష్ రాసుకుని ఉంటే బాగుండేదని సెటైర్లు పేలుస్తున్నాయి వైరి వర్గాలు. లోకేష్ యువగళం యాత్ర ఇందుకేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రతిపక్షనేతగా జగన్ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని నవరత్నాల పథకాలు ప్రకటించారని, ఇప్పుడు లోకేష్ యాత్ర చేపట్టి అధికారుల పేర్లు మాత్రమే నోట్ చేసుకున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ రెడ్ బుక్ ని మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు వైసీపీ సానుభూతిపరులు.

పగ, ప్రతీకారం.. లోకేష్ భారీ డైలాగులు

యువగళం పాదయాత్ర ముగింపు దశలో నారా లోకేష్ పగ, ప్రతీకారం అంటూ భారీ డైలాగులు కొడుతున్నారు. "ప్రభుత్వం మారిన వెంటనే రెడ్ బుక్ లోని వారికి బదులు తీర్చే బాధ్యత నేనే తీసుకుంటా. అకారణంగా 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. ఆయన మర్చిపోయినా.. నేను మర్చిపోను. ఇక సైకోను సింహం ఎలా వేటాడుతుందో చూడండి." అంటూ అనకాపల్లిలో జరిగిన యాదవ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో స్టేట్ మెంట్ ఇచ్చారు లోకేష్. అప్పుడే ఎన్నికలు జరిగినట్టు, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైనట్టు, లోకేష్ బదులు తీర్చుకుంటున్నట్టు.. ఆయన ఊహించుకోవడం మొదలు పెట్టారు.

మరోవైపు యువగళం ముగింపు సభను ఈనెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో ప్లాన్ చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని పవన్ కల్యాణ్ ని తీసుకు రావాలనుకున్నారు. కానీ పవన్ ఆ సభకు రావడంలేదని ముందే చెప్పేశారు. దీంతో టీడీపీకి షాక్ తగిలింది. పవన్ రావడంలేదంటే.. జనసేన నుంచి కూడా పెద్దగా హడావిడి ఉండదు. దీంతో ఈ సభకు హైప్ తీసుకొచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు లోకేష్.

First Published:  17 Dec 2023 2:55 AM GMT
Next Story