Telugu Global
Andhra Pradesh

ఎజెండా లేని చంద్రబాబు: ప్రజలకు ఏం చెబుతారు?

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా నిర్దిష్టమైన విధానం, ఎజెండా లేకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

ఎజెండా లేని చంద్రబాబు: ప్రజలకు ఏం చెబుతారు?
X

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఒక ఎజెండా లేదు, విధానమూ లేదు. దేశంలో నిర్దిష్టమైన విధానం, ఎజెండా లేని నాయకుడు ఆయన ఒక్కరే కనిపిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత నరేంద్ర మోడీని, పవన్‌ కల్యాణ్‌ను వెంటేసుకుని తిరిగి అధికారం సంపాదించుకున్న చంద్రబాబు దిశానిర్దేశం లేకుండా పనిచేశారు. అమరావతిపై కమ్మటి కబుర్లు వినిపించారు. పోలవరంపై మాటలు మాత్రమే చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించి ఉంటే చంద్రబాబు ఊరట పొందేవారు. అయితే, తనవారికి కాంట్రాక్టులు ఇప్పించుకుని, ప్రయోజనం పొందే కుయుక్తితో దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. అయినా, దాన్ని ఓ కొలిక్కి తేలేదు. అమరావతి భ్రమరావతిగానే మిగిలిపోయింది.

ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా నిర్దిష్టమైన విధానం, ఎజెండా లేకుండా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆడిపోసుకుంటున్నారే తప్ప, తాను అధికారంలోకి వస్తే ప్రజల కోసం అమలు చేసే కార్యక్రమాలేమిటో చెప్పలేకపోతున్నారు. అంటే, ఆయన వద్ద అమలు చేయడానికి స్పష్టమైన కార్యక్రమాలేవీ లేవని అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ ఆయన అమరావతి గురించే మాట్లాడుతున్నారు. కోట్లాది మంది ప్రజలను పక్కన పెట్టేసి కేవలం పది లక్షల మంది గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.

అంటే, రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దిశానిర్దేశం లేని నాయకుడిగా మాత్రమే చంద్రబాబు కనిపిస్తున్నారు. పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు తప్ప ప్రజలకు తాను ఇది చేస్తానంటూ నిర్దిష్టమైన కార్యక్రమాలను ప్రకటించడం లేదు. పవన్‌ కల్యాణ్‌ జనసేనతో పొత్తు కుదిరినప్పటికీ బిజెపి విషయం తేలడం లేదు. బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నట్లు అర్థమవుతూనే ఉన్నది. బిజెపిలోనే ఉండి చంద్రబాబు కోసం సిఎం రమేష్‌లాంటివారు పనిచేస్తున్నారు. వారి ద్వారా, పవన్‌ కల్యాణ్‌ ద్వారా బిజెపి తనతో పొత్తు పెట్టుకునేలా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతకు మించిన ఎజెండా చంద్రబాబుకు లేదు.

అధికారంలోకి వస్తే తాను ప్రస్తుతం అమలవుతున్న పథకాలను కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో కూడా చంద్రబాబు లేరు. మొత్తంగా ఒక విధానం, ఎజెండా లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు.

First Published:  27 Jan 2024 9:55 AM GMT
Next Story