Telugu Global
Andhra Pradesh

భువనేశ్వరి ట్వీట్.. రాజమండ్రిలో పొలిటికల్ హీట్

ఓ వైపు చంద్రబాబు ఆరోగ్యం గురించి హడావిడి జరుగుతుండగా.. భువనేశ్వరి సహా కీలక నేతలంతా రాజమండ్రిలోనే మకాం వేశారు. భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ నేతలు ఈరోజు చలో రాజమండ్రి అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

భువనేశ్వరి ట్వీట్.. రాజమండ్రిలో పొలిటికల్ హీట్
X

నారా భువనేశ్వరి నిన్న మొన్నటి వరకూ సింపతీ ట్వీట్లు వేశారు, చంద్రబాబు ఆరోగ్యం గురించి మాత్రమే మాట్లాడారు. తాజాగా ఆమె పొలిటికల్ హీట్ పెంచేలా ట్వీట్ వేశారు. చలో రాజమండ్రి పేరుతో టీడీపీ కార్యకర్తలు తనను కలసి సంఘీభావం తెలపడానికి వస్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. తనను కలవకూడదు అని పార్టీ శ్రేణుల్ని కట్టడి చేయడానికి పోలీసులు ఎవరని ప్రశ్నించారు. అలా ఆదేశాలివ్వడానికి ప్రభుత్వానికి హక్కులేదని స్పష్టం చేశారు.


ఓవైపు చంద్రబాబు ఆరోగ్యం గురించి హడావిడి జరుగుతుండగా.. భువనేశ్వరి సహా కీలక నేతలంతా రాజమండ్రిలోనే మకాం వేశారు. రాజమండ్రిలో ఉన్న భువనేశ్వరిని కలిసేందుకు టీడీపీ నేతలు ఈ రోజు చలో రాజమండ్రి అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. భువనేశ్వరిని కలసి సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేందుకు పథక రచన చేశారు. అయితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరబోతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులిచ్చారు. సంఘీభావ యాత్రకు అనుమతి లేదన్నారు.

పోలీసు నోటీసులపై భువనేశ్వరి మండిపడుతున్నారు. రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముందని ప్రశ్నించారామె. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వాళ్లని, బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? అని ప్రశ్నించారు. భువనేశ్వరి ట్వీట్ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది.


First Published:  17 Oct 2023 6:42 AM GMT
Next Story