Telugu Global
Andhra Pradesh

రామోజీరావుకి మద్దతుగా నాగబాబు ట్వీట్.. కౌంటర్లు మొదలు

రామోజీరావు లక్షలాది మందికి ఆదర్శనీయం అని కొనియాడారు నాగబాబు. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియాలో కావాలనే వేధిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.

రామోజీరావుకి మద్దతుగా నాగబాబు ట్వీట్.. కౌంటర్లు మొదలు
X

పద్మ విభూషణ్ రామోజీని అవమానిస్తారా..?

గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ ని కామెంట్ చేస్తారా..?

ఏడుపదుల రామోజీ రావుని విచారణ పేరుతో వేధిస్తారా..?

జనసేన నాయకుడు, సినీ నటుడు నాగబాబు ఇలా వరుస ట్వీట్లతో రామోజీరావుకి మద్దతుగా నిలిచారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసు విషయంలో సీఐడీ విచారణను ఆయన పరోక్షంగా తప్పుబట్టారు. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో బయటపడని అవినీతి ఆరోపణలు వైసీపీ అధికారంలోకి వచ్చాక పుట్టుకురావడం విచారకరం అన్నారాయన. ఏడు పదుల వయసుపైబడిన రామోజీ రావుని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ మండిపడ్డారు నాగబాబు.


తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగానికి సేవ చేస్తున్న రామోజీరావు లక్షలాది మందికి ఆదర్శనీయం అని కొనియాడారు నాగబాబు. అలాంటి వ్యక్తిని సోషల్ మీడియాలో కావాలనే వేధిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఆ ప్రచారాలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. నాగబాబు వ్యక్తిగత ఖాతానుండి ఈ ట్వీట్లు పడినా.. ఆ తర్వాత ఆయన ట్వీట్లను జనసేన అధికారిక ప్రకటనగా విడుదల చేయడం విశేషం.


రామోజీరావుపై సీఐడీ విచారణ తర్వాత ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. రామోజీ రావు బెడ్ పై పడుకుని ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తూ చాలామంది నెగెటివ్ కామెంట్లు పెట్టారు. సీఐడీ విచారణ అనగానే అనారోగ్యం అంటూ బెడ్ పై పడుకున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. వీటిపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగబాబుకి కౌంటర్లు..

నాగబాబు ట్వీట్లకు వెంటనే కౌంటర్లు పడ్డాయి. గతంలో ప్రజారాజ్యం-కాంగ్రెస్ విలీన సమయంలో ఈనాడుపై చిరంజీవి ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజారాజ్యాన్ని పలుచన చేయడానికి ప్రయత్నించిన సంస్థ, ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై వ్యతిరేక వార్తలిచ్చిన సంస్థ అధినేతకు నాగబాబు ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు నెటిజన్లు.

First Published:  5 April 2023 2:20 AM GMT
Next Story