Telugu Global
Andhra Pradesh

మాకంటే గొప్ప నటుడు జగన్.. వాలంటీర్లను ముసుగేసి కొట్టండి

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం సస్పెన్స్ అని అన్నారు. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు.

మాకంటే గొప్ప నటుడు జగన్.. వాలంటీర్లను ముసుగేసి కొట్టండి
X

పవన్ కల్యాణ్ ని సినీ నటుడిగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు నాగబాబు. సీఎం జగన్ తమకంటే గొప్ప నటుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నటన ముందు తామెవరం పనికిరామని, ఆయన అంతలా నటిస్తారని సెటైర్లు వేశారు. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన నాగబాబు వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు జగనన్న కాలనీల్లో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారంతా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని హెచ్చరించారు.

నేను పోటీ చేయను..

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం సస్పెన్స్ అని అన్నారు. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. 2019లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని, స్థానిక ఎన్నికల్లో అది 24 శాతానికి పెరిగిందని, రాబోయే రోజుల్లో జనసేనకు 40 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.


ఎన్నికల్లో పొత్తులు లేకపోతే జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు నాగబాబు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ చెప్పారంటే కచ్చితంగా ఏదో వ్యూహం ఉన్నట్టేనని అన్నారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు నాగబాబు. లైమ్ లైట్‌ లోకి రావడానికి తమను కొంతమంది విమర్శిస్తుంటారని, అలాగైనా వారికి తాము ఉపయోగపడుతున్నామని చెప్పారు.

ముసుగేసి కొట్టండి..

వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు కొంతమంది వాలంటీర్లు పనిచేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీవారికి సంక్షేమ పథకాలు ఇవ్వబోమని, పింఛన్లు ఆపేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటివారి మాటలను రికార్డు చేయాలని, లేకపోతే ముసుగేసి కొట్టాలని పిలుపునిచ్చారు. అయితే అంతలోనే ఆయన సర్దుకున్నారు. వాలంటీర్లందరినీ ఒకే గాటన కట్టలేమని, కొందరు మాత్రమే అలా చేస్తున్నారని, తన వ్యాఖ్యలు అందరికీ వర్తించవని అన్నారు.

First Published:  22 Jan 2023 3:56 AM GMT
Next Story