Telugu Global
Andhra Pradesh

సీఎం జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు... నాగబాబు ఫైర్

జనసేన నాయకుడు నాగబాబు ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. జీవో నెంబర్ 1ను జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్టూన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలో ఏపీలో తీసుకునే తుగ్లక్ నిర్ణయాలు ఇవేనంటూ కార్టూన్ ద్వారా సెటైర్లు వేశారు.

సీఎం జగన్‌వి తుగ్లక్ నిర్ణయాలు... నాగబాబు ఫైర్
X

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా జీవో నెంబర్ 1ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఇకపై ఎవరైనా సభలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్షాలు సభలు నిర్వహించకుండా అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందని విమర్శలు చేస్తున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై జనసేన నాయకుడు నాగబాబు ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. జీవో నెంబర్ 1ను జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్టూన్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. త్వరలో ఏపీలో తీసుకునే తుగ్లక్ నిర్ణయాలు ఇవేనంటూ కార్టూన్ ద్వారా సెటైర్లు వేశారు.

'రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు ప్రయాణాలు రద్దు.. బైక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి బైక్‌లో తిరగకూడదు. ఇంట్లో గ్యాస్ బండ పేలుతుంది.. ఇంట్లో గ్యాస్ వాడకూడదు.. కారు యాక్సిడెంట్లు అవుతున్నాయి.. కారులో ప్రయాణం రద్దు. కరెంటు షాక్ కొడుతుంది.. ఏపీలో కరెంటు రద్దు..' అని కార్టూన్ ద్వారా ఏపీ ప్రభుత్వ తీరుపై నాగబాబు సెటైర్లు వేశారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా నాగబాబు చేసిన ఈ ట్వీట్‌కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. నాగబాబు చేసిన కామెంట్స్ ను మెగా ఫ్యాన్స్ సమర్థిస్తుండగా.. రోడ్లపై ప్రమాద సంఘటనలు జరిగినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేముందని వైసీపీ మద్దతుదారులు కామెంట్స్ చేస్తున్నారు.

First Published:  9 Jan 2023 6:27 AM GMT
Next Story