Telugu Global
Andhra Pradesh

నాగబాబూ.. హంద్రీనీవా పూర్తి కాకపోవడానికి కారణం ఎవరో తెలుసుకో..

హంద్రీనీవాను పూర్తి చేసి తన సొంత నియోజకవర్గ కుప్పం వరకు నీరు తీసుకెళ్తానని ప్రకటించిన చంద్రబాబును విమర్శించకుండా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని ఆ పార్టీ శ్రేణులు నాగబాబును ప్రశ్నిస్తున్నారు.

నాగబాబూ.. హంద్రీనీవా పూర్తి కాకపోవడానికి కారణం ఎవరో తెలుసుకో..
X

మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో ఒక తాగునీటి ట్యాంక్ ప్రారంభించగా దానిపై జనసేన నాయకుడు నాగబాబు సెటైర్ వేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా.. అంటూ రోజా తాగునీటి ట్యాంకు ప్రారంభిస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శుక్రవారం రోజా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ గ్రామంలో ఓ చిన్న తాగునీటి ట్యాంకును ప్రారంభించారు. అయితే నాగబాబు ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంపై పరోక్షంగా సెటైర్ వేశారు.

'హంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తి తీర్చిన వైసీపీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించినట్లు సమాచారం.' అని నాగబాబు ట్వీట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం హంద్రీనీవాను పూర్తి చేయలేదని నాగబాబు విమర్శలు చేస్తున్నారు కానీ.. అది పూర్తి కాకపోవడానికి గత ప్రభుత్వాల తీరే కారణం. 2008లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సాగు, తాగునీరు అందించడానికి హంద్రీనీవా ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు మొదలైన కొద్ది రోజులకే ఆయన మరణించారు.

ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హంద్రీనీవాను పూర్తి చేసి సీమలోని చివరి ప్రాంతమైన కుప్పం వరకు సాగు, తాగునీరు అందించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అయితే ఆయన కూడా ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు. కల్వర్టులు, కాలువలు, ఇతర పనులు చేయకుండానే కుప్పం వరకు మట్టి కాలువ తవ్వి ఒక దఫా నీరు వదిలి తాను హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేశానని ఘనంగా ప్రకటించుకున్నారు.

అయితే మట్టి కాలువ ద్వారా నీరు విడుదల చేయడంతో అవి కుప్పం చివరి వరకు చేరుకోలేకపోయాయి. ఎక్కడికక్కడ వృథా అయ్యాయి. ఇప్పటికి కూడా రాయలసీమలోని జిల్లాల్లో చాలా చోట్ల హంద్రీనీవా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేయడంపై వైసీపీ శ్రేణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. హంద్రీనీవాను పూర్తి చేసి తన సొంత నియోజకవర్గ కుప్పం వరకు నీరు తీసుకెళ్తానని ప్రకటించిన చంద్రబాబును విమర్శించకుండా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని నాగబాబును ప్రశ్నిస్తున్నారు.

First Published:  11 Feb 2023 8:16 AM GMT
Next Story