Telugu Global
Andhra Pradesh

ఎంపీగా మెగా బ్రదర్ పోటీ?

సీట్ల షేరింగ్, పోటీ చేయబోయే నియోజకవర్గాలను కూడా వీలైనంత తొందరలోనే ఖరారు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ లోక్‌సభ నుండి ఎవరు పోటీ చేయాలనే చర్చ జరిగినప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబు ప్రస్తావన తెచ్చారట.

ఎంపీగా మెగా బ్రదర్ పోటీ?
X

మెగా బ్రదర్స్ లో ఒక‌రైన నాగబాబు రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారా? జనసేన వర్గాలు అవుననే అంటున్నాయి. టీడీపీ+జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల తరపున పోటీ చేయబోయే అభ్యర్థులపై కసరత్తు మొదలైంది. సమన్వయ సమావేశాలు పెట్టుకుంటున్న నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల గొడవలువుతున్నాయి. ఇలాగే వదిలేస్తే రెండు పార్టీల మధ్య గొడవలు మరింత పెరిగే అవకాశముందని ఇరు పార్టీల నేతలు అనుకున్నారట.

అందుకనే సీట్ల షేరింగ్, పోటీ చేయబోయే నియోజకవర్గాలను కూడా వీలైనంత తొందరలోనే ఖరారు చేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ లోక్‌సభ నుండి ఎవరు పోటీ చేయాలనే చర్చ జరిగినప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబు ప్రస్తావన తెచ్చారట. దీనికి టీడీపీ తరపున పాల్గొన్న నేతలు కూడా ఆమోదం తెలిపారట. అందుకనే ఉమ్మడి అభ్యర్థిగా నాగబాబు కాకినాడ ఎంపీగా పోటీ చేయటం ఖాయమైపోయిందని పార్టీలో చర్చ జరుగుతోంది.

పొలిటికల్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరాంధ్రలో ఆ మధ్య పర్యటించిన నాగబాబు తాను ఎన్నికల్లో పోటీ చేయటం లేదని చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అయితే రాజకీయ సమీకరణలు మారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అవసరాల కోసం తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీకి రెడీ అవుతున్నారట. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబుకు సుమారు 2.6 లక్షల ఓట్లొచ్చాయి. సొంత సామాజికవర్గం కాపులు, టీడీపీ ఓటు బ్యాంకు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడితే రాబోయే ఎన్నికల్లో నాగబాబు గెలుపు చాలా తేలికని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్‌పై వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలిచారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటి, జగ్గంపేట అసెంబ్లీలున్నాయి. వీటిల్లో పెద్దాపురంలో తప్ప అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులే గెలిచారు. అయినా గీతకు వచ్చిన మెజారిటి 25,738 ఓట్లు మాత్రమే. ఈ విషయమే జనసేన నేతలను బాగా ఆకర్షిస్తోంది. అందుకనే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే నాగబాబు గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

First Published:  20 Nov 2023 5:42 AM GMT
Next Story