Telugu Global
Andhra Pradesh

నారా లోకేష్‌తో నాదెండ్ల భేటీ.. ఒకే గూటి పక్షులు!

ఏపీలో టీడీపీ- జనసేన పొత్తు ప్రకటన జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా రెండు పార్టీల మధ్య ఒక్క సమావేశం కూడా జరగలేదు. దాంతో సమన్వయ కమిటీ మీటింగ్‌ తేదీపై ఈరోజు భేటీలో ఓ క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది.

నారా లోకేష్‌తో నాదెండ్ల భేటీ.. ఒకే గూటి పక్షులు!
X

చంద్రబాబుతో ములాఖత్ కోసం ఢిల్లీ నుంచి రాజమండ్రికి వచ్చిన నారా లోకేష్‌తో ఈరోజు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవబోతున్నారు. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను ప్రకటించాయి. కానీ.. జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం మాత్రం ఇంకా జరగలేదు. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు నారా లోకేష్‌తో నాదెండ్ల మనోహర్ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఫైనల్ క్లారిటీ కోసం బాబుతో ములాఖత్

తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్లాలా..? లేదా ఒంటరిగా పోటీ చేయాలా..? అనేదానిపై టీడీపీ ఓ క్లారిటీకి రాలేకపోతోంది. ఇప్పటికే జనసేన 32 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించింది. కానీ.. ఇందులో చాలా నియోజకవర్గాలు టీడీపీకి కాస్త పట్టు ఉన్నవే. దాంతో పొత్తుతో వెళ్లకుంటే రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందని జనసేనకి టీడీపీ పెద్దలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఎన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందనే విషయాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు బాబుతో ములాఖత్‌లో మాట్లాడిన లోకేష్.. మనోహర్‌‌తో ఆ విషయంపై చర్చించే అవకాశం ఉంది.

యాక్షన్‌లోకి ఎప్పుడు..?

ఏపీలో టీడీపీ- జనసేన పొత్తు ప్రకటన జరిగి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా రెండు పార్టీల మధ్య ఒక్క సమావేశం కూడా జరగలేదు. దాంతో సమన్వయ కమిటీ మీటింగ్‌ తేదీపై ఈరోజు భేటీలో ఓ క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా నాదెండ్ల మనోహర్ ఈ పొత్తుల వ్యవహారం మొత్తం చూస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి నారా లోకేష్‌తో పాటు సీనియర్ నేతలు ఈరోజు భేటీలో ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్‌కి వార్నింగ్‌తో పాటు జాగ్రత్తలు

లోకేష్, మనోహర్ భేటీ వార్త వెలుగులోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి సోషల్ మీడియాలో వార్నింగ్‌లతో పాటు జాగ్రత్త సూచ‌న‌లు కూడా వస్తున్నాయి. ‘‘ముఖ్యమంత్రి పీఠం కోసం అప్పట్లో ఎన్టీఆర్‌కి మొదట నాదెండ్ల భాస్కర్ వెన్నుపోటు పొడవగా.. ఆ తర్వాత చంద్రబాబు పొడిచాడని.. ఇప్పుడు వారి కొడుకులు భేటీ అవుతున్నారు. కాబట్టి.. నీకు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందంటూ పవన్ కళ్యాణ్‌ని వైసీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. అలానే అభిమానులు కూడా పొత్తుల వ్యవహారం పూర్తిగా మనోహర్‌కి వదిలేయకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కి సూచిస్తున్నారు.

First Published:  18 Oct 2023 4:27 PM GMT
Next Story