Telugu Global
Andhra Pradesh

మనోహర్ అడుగుజాడల్లో పురందేశ్వరి

టీడీపీ పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే, ఆ పార్టీ ఓట్లు ఉపయోగించుకుని గట్టెక్కాలనేది నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి ఆలోచన.

మనోహర్ అడుగుజాడల్లో పురందేశ్వరి
X

అవసరానికి అందర్నీ వాడుకుని వదిలేస్తారని చంద్రబాబుకి పేరు. ఆ చంద్రబాబుని కూడా ఇప్పుడు తమ అవసరానికి వాడుకోవాలని చూస్తున్నారు కొందరు నేతలు. సొంత పార్టీ నేతలయితే పర్లేదు, పక్క పార్టీల వారు ఇప్పుడు చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ అందులో ఒకరయితే, బాబుకి స్వయానా వదిన పురందేశ్వరి మరొకరు. ఇంతకీ వీరిద్దరూ చంద్రబాబుని ఎందుకు కాకా పట్టాలనుకుంటున్నారు, ఎందుకు బాబుకి బాకాలూదుతున్నారు. మీరే చూడండి.

మనోహర్ కి తప్పని పరిస్థితి..

టీడీపీతో జనసేన పొత్తు ఖరారైన తర్వాత అందరికంటే ఎక్కువ సంతోషపడింది నాదెండ్ల మనోహర్. వైసీపీ అధికారంలోకి రాకూడదు అనేది ఒక్కటే పవన్ కల్యాణ్ అజెండా, కానీ జనసేన గెలిచినా గెలవకపోయినా ఈసారి తెనాలి నుంచి తాను కచ్చితంగా గెలవాలి అనేది మనోహర్ అజెండా. అందుకే మనోహర్, చంద్రబాబు ప్రాపకం కోసం తపిస్తున్నారు. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీలో కూడా మనోహర్ కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి ఆ పని మరింత సులభం అవుతుందనేది ఆయన ఆలోచన.

తెనాలి ఎలా..?

2004, 2009లో వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నాదెండ్ల మనోహర్. గతంలో ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు కూడా అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గొలుపొందారు. ఇప్పటికీ అక్కడ కొద్దోగొప్పో నాదెండ్ల ఫ్యామిలీపై సానుభూతి ఉంది. కానీ 2019లో నాదెండ్ల తెనాలి నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పడిపోయారు. వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ విజేత కాగా, టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ రెండో స్థానంలో నిలిచారు. 2024లో కూడా నాదెండ్ల మనోహర్ తెనాలినుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో ఆ స్థానం నాదెండ్లకు రావడం అంత ఈజీ కాదు. కానీ చంద్రబాబు అనుకుంటే అది జరిగి తీరుతుంది. పవన్ కల్యాణ్ ఒప్పించి ఆస్థానం తీసుకునే కంటే, ముందుగా చంద్రబాబునే మెప్పిస్తే అది మరింత సులభం అవుతుంది. అందుకే నాదెండ్ల నేరుగా చంద్రబాబు ప్రాపకం కోసం కాచుకు కూర్చున్నారు. కుదిరితే రాజమండ్రి జైలులో ములాఖత్ కి సైతం వెళ్లేందుకు ట్రై చేస్తున్నారట. 2019 లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ జనసేన, టీడీపీ ఓట్లు కలిపితే వైసీపీ కంటే ఎక్కువ. సో.. 2024లో పొత్తులో ఆ సీటు తనకి వస్తే విజయం గ్యారెంటీ అనేది నాదెండ్ల ధీమా.

ఇక పురందేశ్వరిది మరో కథ. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరికి తాను ఎక్కడ పోటీ చేసినా ఓటమి తప్పదనే విషయం బాగా తెలుసు. జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలు కలిస్తే విజయావకాశాలుంటాయేమో, కానీ కూటమి కుదరదనే విషయం కూడా ఆమెకు బాగా తెలుసు. ఈ దశలో ఆమెకున్న ఏకైక ఆప్షన్ చంద్రబాబు. చంద్రబాబు తలచుకుంటే తాను పోటీ చేసే స్థానంలో టీడీపీ-జనసేన కూటమి తరపున డమ్మీ అభ్యర్థిని నిలబెడతారు. అలా పరోక్షంగా చంద్రబాబు సాయం కోరుతున్నారు పురందేశ్వరి, అందుకే ఆయన అరెస్ట్ పై ఎక్కడలేని సానుభూతి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంలో కూడా చంద్రబాబుకి ప్రయారిటీ దక్కేలా చూశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా ఆమె పార్టీని పక్కనపెట్టి, కుటుంబ సభ్యురాలిగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ చంద్రబాబుని ప్రసన్నం చేసుకోడానికే అనేది స్పష్టంగా తెలుస్తున్న విషయం.

వాస్తవానికి చంద్రబాబుకి దగ్గుబాటి ఫ్యామిలీకి అస్సలు పడదనే విషయం అందరికీ తెలుసు. 2014లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్ సభకు పురందేశ్వరి పోటీ చేస్తే, ఆమె ఓటమి కోసమే చంద్రబాబు ప్రయత్నించారు. టీడీపీ ఓట్లు ఆమెకు ట్రాన్స్ ఫర్ కాకుండా చూడగలిగారు. ఇక 2019లో పురందేశ్వరి విశాఖ ఎంపీగా పోటీ చేసినా ఫలితం లేదు. ఇప్పుడు కూడా బీజేపీ తరపున ఆమె ఒంటరిగానే బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ దఫా పురందేశ్వరి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారట. కానీ ఈసారి ఆమె టీడీపీ సపోర్ట్ కోరుకుంటున్నారు. కూటమి లేకపోతే లోపాయికారీగా అయినా చంద్రబాబు మద్దతుతో గెలవాలనేది ఆమె ఆలోచన. అందుకే చంద్రబాబు అరెస్ట్ పై సానుభూతి చూపించారు. టీడీపీ సానుభూతి కూడా పొందారు. ఇక ఎన్నికల సమయానికి పురందేశ్వరి ఎన్ని రంగులు మారుస్తారో చూడాలి.

ఓవైపు టీడీపీకి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారాయి. చంద్రబాబు కూడా ఈ ఎన్నికల తర్వాత అంత యాక్టివ్ గా ఉంటారనుకోలేం. టీడీపీ పరిస్థితే అంతంత మాత్రంగా ఉంటే, ఆ పార్టీ ఓట్లు ఉపయోగించుకుని గట్టెక్కాలనేది నాదెండ్ల మనోహర్, పురందేశ్వరి ఆలోచన. ఈ ఎత్తులు, పై ఎత్తులు 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు తెస్తాయో వేచి చూడాలి.


First Published:  29 Sep 2023 8:34 AM GMT
Next Story