Telugu Global
Andhra Pradesh

ప్రేమించి పెళ్లాడితే.. క‌త్తిపోట్ల‌తో ఉసురు తీశాడు.. - స‌చివాల‌య ఉద్యోగిని హ‌త్య‌కేసులో భ‌ర్తే హంత‌కుడు..!

అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత రెండు కత్తులతో ఆమె శరీరంపై ఇష్టారాజ్యంగా దాడిచేశాడు. సైకో మాదిరిగా 16 చోట్ల లోతైన గాయాలు, మరో 20 వరకు చిన్నచిన్న గాయాలు చేసి దారుణంగా చంపేశాడు.

ప్రేమించి పెళ్లాడితే.. క‌త్తిపోట్ల‌తో ఉసురు తీశాడు.. - స‌చివాల‌య ఉద్యోగిని హ‌త్య‌కేసులో భ‌ర్తే హంత‌కుడు..!
X

సచివాలయ ఉద్యోగి మహాలక్ష్మి హ‌త్య‌కేసు కొలిక్కి వ‌చ్చింది. ఆమెను హత్యచేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భ‌ర్త శ్రీనివాసకుమారేనని పోలీసులు తేల్చారు. గత నెల 29న అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో ఈ హ‌త్య‌ జ‌రిగింది. దీనికి సంబంధించిన వివరాలను పరవాడ డీఎస్పీ సత్యనారాయణ గురువారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

పెళ్లయిన వారం నుంచే..

విశాఖ జిల్లా కూర్మన్నపాలేనికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి (26) రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం సచివాలయంలో వ్య‌వ‌సాయ స‌హాయ‌కురాలిగా పనిచేస్తోంది. ఆమెను గాజువాక అరుణోదయ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాసకుమార్ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. గిరిజన యువతి అయిన మ‌హాల‌క్ష్మిని పెళ్లయిన వారం నుంచే నిందితుడి త‌ల్లి, కుటుంబ స‌భ్యులు కులం పేరుతో వేధిస్తూ అవ‌మానాల‌కు గురిచేసేవారు. వంట బాగా చేయ‌డం లేద‌ని వంక‌లు పెట్టేవారు. అద‌న‌పు క‌ట్నం తీసుకురావాల‌ని వేధించేవారు.

పుట్టింటికి వ‌చ్చేసినా వ‌ద‌ల్లేదు..

వారి వేధింపులు తాళ‌లేక మ‌హాల‌క్ష్మి త‌న పుట్టింటికి వ‌చ్చేసింది. అయినా వ‌ద‌ల‌కుండా ఆమె భ‌ర్త శ్రీ‌నివాస‌కుమార్ ఆమెను వేధిస్తుండేవాడు. పనిచేస్తున్న చోట ఆమెపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉన్నతాధికారుల వద్ద ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నించాడు. దీనిపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన మ‌హాల‌క్ష్మి త‌న‌కు విడాకులు ఇప్పించమని వేడుకుంది. అది పోలీసుల ప‌రిధిలోది కాక‌పోవ‌డంతో వారు ఏమీ చేయ‌లేక‌పోయారు. ఎన్నివిధాల ప్రయత్నించినా ఆమె లొంగకపోవడంతో ఆమెను హత్య చేయాలని భ‌ర్త‌ పథకం రచించాడు. ఆమె తనకు విడాకులు ఇచ్చేస్తే ఉద్యోగం లేని తన జీవితం దుర్భరంగా మారుతుందనే భయం, విడాకులు ఇస్తోందనే పగ, కసి పెరిగి రెండు కత్తులను కొనుగోలు చేశాడు. గత నెల 29న నమ్మకంగా కాల్ చేసి ఆమెను అచ్యుతాపురంలోని లాడ్జికి రప్పించాడు. భోజనంలో మత్తు మాత్రలు కలిపి తినిపించాడు.

2 క‌త్తుల‌తో 36 సార్లు పొడిచి..

కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత రెండు కత్తులతో ఆమె శరీరంపై ఇష్టారాజ్యంగా దాడిచేశాడు. సైకో మాదిరిగా 16 చోట్ల లోతైన గాయాలు, మరో 20 వరకు చిన్నచిన్న గాయాలు చేసి దారుణంగా చంపేశాడు. శబ్దాలు రావడంతో లాడ్జి సిబ్బంది యజమాని ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వెళ్లే సమయానికి యువతి కొనఊపిరితో ఉంది. ఆసుపత్రికి తీసుకెళుతుండ‌గా మార్గంలోనే ప్రాణాలు కోల్పోయింది.

నేరం నుంచి త‌ప్పించుకోవాల‌ని త‌న‌కు తాను గాయాలు చేసుకొని..

నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాసకుమార్ త‌న శ‌రీరంపై చిన్నచిన్న గాయాలు చేసుకొని పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. ఆ గదిలో లభించిన ఇంజక్షన్లు, మాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి తండ్రి సాంబ ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్యానేరం, వరకట్నం వేధింపులు, మహిళా హింస, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదుచేశారు. బీటెక్ చదువుకున్నా ఉద్యోగం లేకపోవడం, భార్య దూరమైతే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయనే భయంతోనే మహాలక్ష్మిని హత్యచేశాడని విచార‌ణ‌లో తేలడంతో శ్రీనివాసకుమార్‌ను అరెస్టు చేశారు.

First Published:  9 Jun 2023 5:50 AM GMT
Next Story