Telugu Global
Andhra Pradesh

టీడీపీ నేతపై హత్యాయత్నం.. - రాజకీయం మొదలుపెట్టిన తెలుగు తమ్ముళ్లు

కాకినాడ జిల్లా తుని‌లో టీడీపీ నేత పల్నాటి శేషగిరిపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు భవానీ మాల వేసుకొని వచ్చి అతడిపై కత్తితో దాడి చేశారు.

టీడీపీ నేత పల్నాటి శేషగిరి
X

టీడీపీ నేత పల్నాటి శేషగిరి

రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. దాన్ని అధికార పార్టీకి అంటగట్టి రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ కు వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏ ఘటన జరిగినా.. ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. అటువంటిది ఏకంగా టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగితే ఊరుకుంటారా..? ఏకంగా ఓ మంత్రినే టార్గెట్ చేశారు. ఆయనే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు.

కాకినాడ జిల్లా తుని‌లో టీడీపీ నేత పల్నాటి శేషగిరిపై హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు భవానీ మాల వేసుకొని వచ్చి అతడిపై కత్తితో దాడి చేశారు. రక్తపు మడుగులో పడిఉన్న శేషగిరిని భార్య.. తుని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు అప్పుడే రాజకీయం మొదలుపెట్టారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి దాడిశెట్టి రాజానే ఈ హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. అతడు కాపునేత కాబట్టి.. కాపులను ఎదగనివ్వకూడదనే హత్యలు చేయించారని ఆయన ఆరోపించారు.

కాగా ఈ ఘటనను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వ్యక్తిగత కక్షలతో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో హత్యాయత్నం చేస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని.. బాధ్యులను కచ్చితంగా పట్టుకుంటారని పేర్కొన్నారు.

First Published:  17 Nov 2022 9:32 AM GMT
Next Story