Telugu Global
Andhra Pradesh

ముద్రగడ మరో లేఖ రాశారు..

తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా సీఎంకు లేఖ రాశారు. ఐదు శాతం రిజర్వేషన్‌ కాపులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ కాస్త హుందాగానే లేఖ రాశారు.

ముద్రగడ మరో లేఖ రాశారు..
X

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల్లోని పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం ఏపీలో కాపులకు కేటాయించాలంటూ కాపు నాయకులు గళమెత్తుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరిరామ జోగయ్య సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈనెలాఖరులోగా జీవో ఇవ్వకపోతే జనవరి 2వ తేదీ నుంచి నిరవధిక నిరాహర దీక్ష చేస్తానని ప్రకటించారు. తన లేఖను ముందస్తు నోటీసుగా భావించాలని కాస్త హెచ్చరిక ధోరణిలో జోగయ్య స్పందించారు.

తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా సీఎంకు లేఖ రాశారు. ఐదు శాతం రిజర్వేషన్‌ కాపులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముద్రగడ కాస్త హుందాగానే లేఖ రాశారు. పది శాతం కోటాలో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చుకోవడానికి అభ్యంతరం లేదని కేంద్రం కూడా చెప్పింది కాబట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు.

2019 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కాపులు వైసీపీ గెలుపున‌కు ఉపయోగపడ్డారని లేఖలో ముద్రగడ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మీ విజయానికి కాపులు మరోసారి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని ముద్రగడ వ్యాఖ్యానించారు.

తాను పుట్టిన కులం కోసం అవకాశం ఉన్నంత వరకు ఇతరులకు నష్టం లేకుండా సహాయపడాలనే తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని కూడా లేఖలో ముద్రగడ వివరించారు. ఎన్టీఆర్‌ను, వైఎస్‌ఆర్‌ను ప్రజలు దేవుళ్లుగా భావిస్తారని.. మీరు కూడా ప్రజల నుంచి ఆ స్థాయిలో ప్రేమ అందుకునేందుకు పునాదులు వేసుకోవాలని ముద్రగడ తన లేఖలో సీఎంను కోరారు.

Next Story