Telugu Global
Andhra Pradesh

పవన్ ని వెంటాడుతున్న ముద్రగడ..

చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ కల్యాణ్ జనరల్‌ మేనేజర్‌ అని సింగిల్ స్టేట్ మెంట్ తో జనసేనాని పరువు తీసేశారు ముద్రగడ పద్మనాభం.

పవన్ ని వెంటాడుతున్న ముద్రగడ..
X

పిఠాపురంలో పోటీ చేయడం లేదన్నమాటే కానీ, పవన్ కల్యాణ్ ని నీడలా వెంటాడుతున్నారు ముద్రగడ పద్మనాభం. ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టినా, వైసీపీలో ఏ నాయకుడికి మద్దతుగా ప్రచారానికి వెళ్లినా పవన్ ప్రస్తావన తీసుకొచ్చి మరీ విమర్శిస్తున్నారు. జనసేనానికి కాపు ఓట్లు పడకుండా చూస్తానంటున్నారు. తాజాగా తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ముద్రగడ మరోసారి పవన్ పై చెణుకులు విసిరారు.

చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ కల్యాణ్ జనరల్‌ మేనేజర్‌ అని సింగిల్ స్టేట్ మెంట్ తో జనసేనాని పరువు తీసేశారు ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్‌ చేసి పంపాలని కోరారు. 21 సీట్లకే పవన్‌ ముఖ్యమంత్రి అవుతారంట అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ ని ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్‌ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడని ప్రశ్నించారు. ఆ 21 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్‌ చేస్తే పవన్ ఏపీ రాజకీయాల్లో అతిగొప్ప త్యాగశీలిగా మిగిలిపోతారన్నారు. సినిమా షూటింగ్స్‌ గ్యాప్ లో వచ్చి రాజకీయాలు చేసే వారికి ఓట్లు వేయొద్దని, ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించాలని ముద్రగడ పిలుపునిచ్చారు.

పేకాట క్లబ్‌లు నడిపే వారితో పవన్ కల్యాణ్ తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు ముద్రగడ. సోషల్‌ మీడియాలో చెత్త మెసేజ్‌లు పెడుతూ తనను అవమానిస్తున్నారన్నారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్‌ అంటున్నారని, అదే సమయంలో 2 లక్షల మెజార్టీ వస్తుందని కూడా ఆయనే ప్రచారం చేసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు.

బాబుకి కౌంటర్లు..

కూటమి అధికారంలోకి వ‍స్తే సీఎం జగన్‌ ప్రభుత్వం చేపట్టిన పథకాలను అమలు చేస్తామంటున్నారని, అంతమాత్రానికి ఏపీలో అధికార మార్పిడి జరగాల్సిన అవసరం ఏముందని లాజిక్ తీశారు ముద్రగడ. ఎవరైనా అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. స్వచ్చమైన లిక్కర్‌ ఇస్తామని చెప్పడం కేవలం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు ముద్రగడ.

First Published:  6 April 2024 11:38 AM GMT
Next Story