Telugu Global
Andhra Pradesh

అక్కడ బిల్కిస్ బానో.. ఇక్కడ నవనీతమ్మ..

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఏపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో 8మంది నేరస్థులు జైలునుంచి విడుదలయ్యారు.

అక్కడ బిల్కిస్ బానో.. ఇక్కడ నవనీతమ్మ..
X

రేపిస్ట్ లకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంపై బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమె తరఫున కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు 11మంది రేపిస్ట్ ల క్షమాభిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఇటు ఏపీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఏపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో 8మంది నేరస్థులు జైలునుంచి విడుదలయ్యారు. అయితే వీరి విడుదలను ఆక్షేపిస్తూ తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ అనే మహిళ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. నవనీతమ్మ భర్త పార్థమరెడ్డిని హత్యచేసిన కేసులో వారు జైలుశిక్ష అనుభవిస్తూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విడుదలయ్యారు.

14ఏళ్ల జైలు జీవితం పూర్తి కాకుండానే..

జీవిత ఖైదు పడిన వారు కనీసం 14ఏళ్ల జైలు జీవితం గడిపితేనే వారికి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అర్హత వస్తుంది. అయితే ఇక్కడ పార్థమరెడ్డి హత్య కేసులో 8మంది నిందితులకు 14ఏళ్ల జైలుశిక్ష ఇంకా పూర్తికాలేదు. గతేడాది కూడా వీరికి క్షమాభిక్ష పెట్టబోతున్నట్టు తెలుసుకున్న బాధితురాలు నవనీతమ్మ అభ్యంతరం తెలుపుతూ కోర్టులో పిటిషన్ వేశారు, దీంతో గతేడాది ఈ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ఈ ఏడాది ఆ ఎనిమిది మంది క్షమాభిక్షతో విడుదలయ్యారు. దీంతో నవనీతమ్మ మరోసారి కోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్ష పెట్టారని ఆమె పిటిషన్ దాఖలు చేసింది, వారందర్నీ తిరిగి జైలుకి పంపించాలని కోరింది.

హైకోర్టు ఆక్షేపణ..

దోషుల్లో కొందరు 8 ఏళ్లు, మరికొందరు 11 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారని తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాది. కనీసం 14 ఏళ్ల శిక్ష అనుభవించకుండా వారిని విడుదల చేశారని తెలిపారు. గవర్నర్‌ అధికారాల మేరకే ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్.. జీవిత ఖైదు శిక్ష పడిన వారు కనీసం 14 ఏళ్ల జైలు జీవితం అనుభవించడంతో పాటు, సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులన్నారు. పూర్తి వివరాలతో వాదనలు చెప్పేందుకు సిద్ధపడి రావాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.

First Published:  23 Aug 2022 8:40 AM GMT
Next Story