Telugu Global
Andhra Pradesh

SK వర్సిటీలో మృత్యుంజయ హోమం.. - ఏకంగా సర్క్యులర్ జారీ

చందాల వసూలు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించారు. చందాలను ఈనెల 21 లోపు చెల్లించాలని సర్క్యులర్ లో స్పష్టం చేశారు.

SK వర్సిటీలో మృత్యుంజయ హోమం.. - ఏకంగా సర్క్యులర్ జారీ
X

ఏపీలో కొన్ని యూనివర్సిటీ వీసీల సొంత నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించేందుకు సిద్ధమవడం విమర్శలకు తావిస్తోంది. అనధికారికంగా కాకుండా ఏకంగా ఈ హోమానికి సంబంధించి సర్క్యులర్ ని కూడా జారీ చేశారు.

యూనివర్సిటీ వీసీ ఆదేశాల మేరకే సర్క్యులర్ జారీ చేసినట్లు రిజిస్ట్రార్ వెల్లడించారు. ఈనెల 24న వర్సిటీలోని క్రీడా మైదానంలో హోమం నిర్వహిస్తున్నట్లు సర్క్యులర్ లో వివరించారు. ఈ ధన్వంతరి మహా మృత్యుంజయ హోమంలో పాల్గొనాలనుకుంటున్నవారు చందాలు ఇవ్వాల్సిందిగా ఆ సర్క్యులర్ లో సూచించారు. బోధన సిబ్బంది 500 రూపాయలు, బోధనేతర సిబ్బంది 100 రూపాయల చొప్పున చెల్లించాలని అందులో ఉంది. అంతకంటే ఎక్కువ ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పారు.

చందాల వసూలు కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమించారు. చందాలను ఈనెల 21 లోపు చెల్లించాలని సర్క్యులర్ లో స్పష్టం చేశారు. ఈ హోమాన్ని ఎందుకు చేస్తున్నారో కారణాన్ని కూడా వర్సిటీ రిజిస్ట్రార్ ఆ సర్క్యులర్ లోనే వివరించారు. ఇటీవల యూనివర్సిటీలో పనిచేస్తున్న వారు అకాల మరణం పొందుతున్నారని, వాటిని నివారించేందుకే ఈ మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇలా అధికారికంగా హోమానికి సంబంధించి సర్క్యులర్ విడుదల చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీలో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అని కొందరు నిలదీస్తున్నారు.

హోమాల మీద నమ్మకం ఉంటే వీసీ, రిజిస్ట్రార్ తమ ప్రైవేట్ కార్యక్రమంగా దాన్ని నిర్వహించుకోవచ్చని అలా కాకుండా సర్క్యులర్ జారీ చేయడం, చందాలు ఇవ్వాలంటూ అందులో పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు .

సర్క్యులర్ జారీ వివాదాస్పదం కావడంతో రిజిస్ట్రార్ లక్ష్మయ్య స్పందించారు. హోమంలో వ్యక్తిగతంగా పూజలు చేయించుకోవాలనుకునే వారు మాత్రమే చందాలు ఇవ్వచ్చని, ఇందులో ఎలాంటి బలవంతం లేదని వివరించారు. కేవలం ఉద్యోగులు, విద్యార్థుల శ్రేయస్సు కోసమే తాము హోమం నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు.

First Published:  20 Feb 2023 9:50 AM GMT
Next Story