Telugu Global
Andhra Pradesh

మా సింహాన్ని ఈసీ పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టింది

తాను కూడా వైసీపీలో సభ్యుడిగా ఉన్నాను.. భవిష్యత్తులో తాను అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నా అందుకు అవకాశం లేదంటున్నారు ఇది చెల్లుబాటు అవుతుందా? అని ఆరా తీశానని చెప్పారు.

మా సింహాన్ని ఈసీ పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టింది
X

వైసీపీ శాశ్వత అధ్యక్షుడి విషయంలో ఈసీ వద్ద వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఛానల్‌లో పులివెందుల పులి, మా వాడు సింహం, ప్రతి 15 రోజులకోసారి వేటాడుతుంది అని వాళ్లకు వాళ్లే చెప్పుకునేవారని.. ఈరోజు సింహాన్ని ఎన్నికల సంఘం పిచ్చికుక్కను కొట్టిన్టటు కొట్టిందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

తాను ఆరోజే చెప్పానని.. ఇదో పిచ్చి చర్య, దేశంలో శాశ్వత అధ్యక్షుడి విధానమే లేదు అన్నానని అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్లీనరీ అయిపోగానే తాను ఈసీని కలిసి ఫిర్యాదు చేశానని.. తాను కూడా వైసీపీలో సభ్యుడిగా ఉన్నాను.. భవిష్యత్తులో తాను అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నా అందుకు అవకాశం లేదంటున్నారు ఇది చెల్లుబాటు అవుతుందా? అని ఆరా తీశానని చెప్పారు.

ఆరోజే ఎన్నికల కమిషన్‌ అలాంటి విధానమే లేదు.. ఒకవేళ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకునే ముందుకెళ్తామని వైసీపీ చెబితే.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసేందుకు నిబంధనల ప్రకారం సాధ్యం కాదని చెప్పిందన్నారు. చివరకు నాలుగుసార్లు హెచ్చరిస్తే.. ఆఖరిలో అసలు శాశ్వత అధ్యక్షుడిగా తాము ప్రకటించలేదు.. మీడియాలో మాత్రమే వచ్చింది.. అదేలా వచ్చిందో మేం కూడా ఆరా తీస్తున్నామంటూ తప్పుడు సమాధానం ఇచ్చారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఇకనైనా సింహం, పులి అని సొంత ఛానల్‌లో డబ్బా కొట్టుకోకుండా నిబంధనలను పాటించాలని సూచించారు.

ఒళ్లు దగ్గరపెట్టుకపోతే వీపు పగిలిపోతుందని ఈసీ ఈరోజు మర్యాదగా వార్నింగ్ ఇచ్చిందన్నారు. ఎలాగో పలాయనవాదం తీసుకున్నారు కాబట్టి ఇక శాశ్వత అధ్యక్షుడి హోదా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లరనే తాను భావిస్తున్నానని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

First Published:  22 Sep 2022 6:08 AM GMT
Next Story