Telugu Global
Andhra Pradesh

మూడు పార్టీల వైపు రఘురామ చూపు.. కానీ కరుణించేవారేరి.?

వైసీపీ రెబల్ ఎంపీ కే.రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని పార్టీలను ఒక రౌండ్ చుట్టేసిన రఘురామ.. 2024లో ఏ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలా అనే సందిగ్దంలో ఉన్నారు.

మూడు పార్టీల వైపు రఘురామ చూపు.. కానీ కరుణించేవారేరి.?
X

వైసీపీ రెబల్ ఎంపీ కే.రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అన్ని పార్టీలను ఒక రౌండ్ చుట్టేసిన రఘురామ.. 2024లో ఏ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలా అనే సందిగ్దంలో ఉన్నారు. సందిగ్దంలో ఉన్నారు అనే కంటే.. ఏ పార్టీ దయతలచి టికెట్ ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారని అనవచ్చు. 2014లో వైసీపీలో జాయిన్ అయినా.. ఆయనకు టికెట్ దక్కక పోవడంతో పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీ, టీడీపీలో జాయిన్ అయ్యి.. చివరకు 2019లో వైసీపీ టికెట్‌పై నర్సాపురం ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకే సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

సొంత పార్టీ ఎంపీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినా అధినేత జగన్ లైట్ తీసుకున్నారు. అనవసరంగా ఉన్న ఎంపీని పోగొట్టుకోవడం ఇష్టం లేక మొదట్లో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ జులై 2020లో రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత రఘురామ తన విమర్శల దాడిని పెంచారు. కానీ, పార్టీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. కావాలనే రఘురామను పట్టించుకోవడం మానేశారు. దీంతో రఘురామ కృష్ణం రాజు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే ఆసక్తి ఏపీలో పెరిగింది. పవన్ కల్యాణ్‌ గురించి అనుకూలంగా మాట్లాడటంతో జనసేన నుంచి ఆయనకు టికెట్ కన్ఫార్మ్ అని అనుకున్నారు.

గత ఎన్నికల్లో నర్సాపురం నుంచి జనసేన తరపున నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు. ఆయన దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లు తెచ్చుకున్నారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయను అని నాగబాబు ప్రకటించారు. దీంతో నాగబాబు బదులు రఘురామను బరిలోకి దించుతారనే ప్రచారం జరిగింది. అయితే, రఘురామ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకోవడంపై కార్యకర్తల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఆయన చంచల మనస్తత్వానికి పార్టీ సరిపోదని, ఒక అనుచర వర్గం కూడా లేని వ్యక్తిని పార్టీలోకి తీసుకొస్తే తాము వేరే దారి చూసుకుంటామని కొంత మంది జనసేన నాయకులు పవన్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వరకు వేచి చూడండి.. తానింకా అభ్యర్థులను ఖరారు చేయలేదు కదా అని వారిని సముదాయించి పంపినట్లు తెలుస్తోంది.

ఇక చంద్రబాబు నాయుడు కూడా రఘురామకు ఛాన్స్ ఇస్తారా అనే దానిపై అనుమానాలు ఉన్నాయి. గత పాతికేళ్లుగా నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థి ఎంపీగా గెలవలేదు. 1996లో చివరి సారిగా కొత్తపల్లి సుబ్బారాయుడు నర్సాపురం నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లేదా బీజేపీ గెలుస్తూ వచ్చింది. బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయడం వల్లే నర్సాపురం సీటును దక్కించుకోగలిగింది. 2014లో వైసీపీ అభ్యర్థి వాకా రవీంద్రనాథ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా, 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు గెలిచారు. ఆనాడు బీజేపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వైసీపీకి కలిసి వచ్చింది. కానీ, వచ్చే సారి మాత్రం బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

బీజేపీ-టీడీపీ పొత్తు ఉంటే మాత్రం రఘురామకు టికెట్ దక్కడం కష్టమే. ఆ స్థానం నుంచి కచ్చితంగా బీజేపీనే పోటీ చేస్తుంది. బీజేపీ తరపున నర్సాపురం టికెట్‌ను సినీ నటుడు ప్రభాస్ అన్నయ్య ప్రభోద్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం కూడా ప్రభోద్‌కు మాట ఇచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రఘురామ కృష్ణంరాజు ఏదో ఒక కొత్త పార్టీని వెతుక్కోవల్సి ఉంటుంది. మొత్తానికి సొంత పార్టీ వైసీపీని ఇరుకున పెట్టినందుకు ట్రిపుల్ ఆర్‌కు చివరకు ఏ పార్టీ కూడా అక్కున చేర్చుకునే అవకాశమే లేకుండా పోయింది.

First Published:  27 Sep 2022 3:30 AM GMT
Next Story