Telugu Global
Andhra Pradesh

బెజవాడ టీడీపీలో ముసలం.. పార్టీకి ఎంపీ కేశినేని నాని గుడ్ బై

ఆ తర్వాత కూడా పార్టీ అధ్యక్షుడికి తాను విధేయుడిని అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు నాని. బాబుకి తాను వెన్నుపోటు పొడవలేనంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. తీరా ఆయన సర్దుకుపోయారనుకుంటున్న టైమ్ లో సోషల్ మీడియా ద్వారా మళ్లీ బాంబు పేల్చారు.

బెజవాడ టీడీపీలో ముసలం.. పార్టీకి ఎంపీ కేశినేని నాని గుడ్ బై
X

వైసీపీనుంచి నాయకులు బయటకు వస్తుంటే సంబరపడ్డ టీడీపీకి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. గతంలోనే కొంతమంది పార్టీని వదిలి వెళ్లిపోయినా ఎన్నికల వేళ టీడీపీలో తొలి వికెట్ పడటం విశేషం. అది కూడా ఒక ఎంపీ పార్టీకి దూరం జరగడం టీడీపీకి గట్టి ఎదురుదెబ్బే. వచ్చేదఫా టికెట్ రాదని తేలిపోవడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. చంద్రబాబుకి తన అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా తాను ఆ పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదంటూ ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. త్వరలో ఢీల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత టీడీపీకి కూడా రాజీనామా చేస్తానన్నారు కేశినేని నాని.

మూడురోజులుగా హాట్ టాపిక్..

ఎంపీగా గెలిచినప్పటినుంచి పార్టీపై పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బయట పెట్టారు కేశినేని నాని. ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం, ఆ వెంటనే సర్దుకుపోవడం ఆయనకు అలవాటుగా మారింది. గతంలో బెజవాడ మేయర్ అభ్యర్థిగా నాని కుమార్తెను టీడీపీ ప్రకటించినా.. స్థానిక నాయకులు కలసి రాకపోవడంతో కనీసం ఆమె కార్పొరేటర్ గా కూడా గెలవలేకపోయారు. దీంతో కేశినేని మరింత హర్ట్ అయ్యారు. దీంతోపాటు.. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని, నారా లోకేష్ కి దగ్గరకావడం కూడా నానికి ఆగ్రహానికి మరో కారణం. చిన్నికి ఈసారి విజయవాడ ఎంపీ సీటు ఖాయం అని తేలడంతో నాని ఇక అక్కడ ఇమడలేకపోయారు. ఆ తర్వాత కూడా పార్టీ అధ్యక్షుడికి తాను విధేయుడిని అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు నాని. బాబుకి తాను వెన్నుపోటు పొడవలేనంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. తీరా ఆయన సర్దుకుపోయారనుకుంటున్న టైమ్ లో సోషల్ మీడియా ద్వారా మళ్లీ బాంబు పేల్చారు నాని. టీడీపీని వీడుతున్నట్టు ప్రకటించారు.

ఈ ప్రకటన కు ముందు కేశినేని నాని తన అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మూడోసారి కూడా తాను విజయవాడ లోక్ సభకు పోటీ చేస్తానని, ఇండిపెండెంట్ గా బరిలో దిగినా విజయం తనదేనంటున్నారు నాని. ఇటీవల ఆయన బీజేపీతో కూడా సన్నిహితంగా ఉంటున్నారు. ఇంతకీ నాని ఎంపీ పదవికి నిజంగానే రాజీనామా చేస్తారా, ఆ తర్వాత టీడీపీని కూడా విడిచిపెడతారా..? వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తారా..? అనేవి తేలాల్సి ఉంది.

First Published:  6 Jan 2024 3:53 AM GMT
Next Story