Telugu Global
Andhra Pradesh

నెట్టెం గాలితీసేసిన కేశినేని

నిజంగా క్రమశిక్షణ‌ చర్యలు తీసుకునేంత ధైర్యముంటే తాను నేతల జాబితాను పంపిస్తానని కూడా నెట్టెంకు ఎంపీ బంపరాఫర్ ఇచ్చారు. అయితే ఎంపీ సెటైర్లపై నెట్టెం నోరు కూడా విప్పలేదు.

నెట్టెం గాలితీసేసిన కేశినేని
X

విజయవాడ తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పిన నేతలపై యాక్షన్ తప్పదంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఎంపీ కేశినేని నాని అంతకన్నా సీరియస్ గా స్పందించారు. నెట్టెంను ఉద్దేశించి నాని మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పిన నేతలపై యాక్షన్ తీసుకునేంత సీనుందా అంటూ ఎగతాళిగా మాట్లాడారు.

నిజంగా క్రమశిక్షణ‌ చర్యలు తీసుకునేంత ధైర్యముంటే తాను నేతల జాబితాను పంపిస్తానని కూడా నెట్టెంకు ఎంపీ బంపరాఫర్ ఇచ్చారు. అయితే ఎంపీ సెటైర్లపై నెట్టెం నోరు కూడా విప్పలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీకి చాలా సంవత్సరాల క్రితమే దూరమైపోయిన నెట్టెం రఘురామ్ ను చంద్రబాబు నాయుడు మళ్ళీ యాక్టివ్ చేశారు. నిజానికి పార్టీ నేతలు నెట్టెంను ఎప్పుడో మరచిపోయారు. అలాంటి నేతకు చంద్రబాబు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు.

ఈయన పేరుకు జిల్లా అధ్యక్షుడే కానీ చాలామంది నేతలు అసలు నెట్టెం మాటే వినటంలేదు. పైగా అధ్యక్షుడు తెరమీదకు వచ్చేనాటికే ఎంపీ కేశినేని నానికి విజయవాడలోని బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా వర్గానికి ఏమాత్రం పడటంలేదు. ఈ రెండువర్గాల‌ మధ్య సయోధ్య చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాక చివరకు చేతులెత్తేశారు. ఇలాంటి వర్గాల మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం తెరమీదకు వస్తూనే ఉంది.

వాస్తవం చెప్పాలంటే పార్టీలోని నేతల్లో ఎవరిమీదా యాక్షన్ తీసుకునేంత సీన్ నెట్టెంకు లేదు. చంద్రబాబే యాక్షన్ తీసుకోలేక వదిలేస్తే ఇక నెట్టెం మాత్రం ఎవరిపైన యాక్షన్ తీసుకోగలరు ? పార్టీలోని ప్రతి నేతకు డైరెక్టుగా చంద్రబాబుతోనే సంబంధాలున్నాయి. కాబట్టి నెట్టెం బెదిరింపులే కాదు చివరకు మాటను కూడా ఎవరు లెక్కచేయటంలేదు. ఇదే ఆయనకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే నేతలపై క్రమశిక్షణ చర్యలని నెట్టెం హెచ్చరించగానే ఎంపీ పూర్తిగా గాలి తీసేశారు. మరిక నెట్టెం ఏమిచేస్తారో చూడాల్సిందే.

First Published:  9 Oct 2022 9:08 AM GMT
Next Story