Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసులో అవినాష్ సాక్షి మాత్రమే

మొత్తానికి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని అర్థ‌మవుతోంది. అనుమానితులను లేదా నిందితులను మాత్రమే అరెస్ట్‌ చేసే అవకాశముంది కాని సాక్ష్యులను ఎప్పుడూ అరెస్ట్‌ చేయరు.

వివేకా హత్య కేసులో అవినాష్ సాక్షి మాత్రమే
X

వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కేవలం సాక్షి మాత్రమేనని సీబీఐ న్యాయవాది కోర్టుకు స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఎంపీని సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై తనపై సీబీఐ ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆపాలని ఎంపీ తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. దానిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. విచారణ సందర్భంగా జడ్జి జోక్యం చేసుకుని అవినాష్‌ను సీబీఐ సాక్షిగా పిలిచిందా? లేకపోతే నిందితుడిగా పిలిచిందా అని సూటిగా ప్రశ్నించారు.

దానికి సీబీఐ లాయర్ సమాధానమిస్తూ హత్యకేసులో అవినాష్ అనుమానితుడు, నిందితుడని సమాధానమిచ్చారు. అయితే జడ్జి మళ్ళీ రెండోసారి తన ప్రశ్నను రిపీట్ చేశారు. అప్పుడు లాయర్ సమాధానమిస్తు కేవలం సాక్షిగా మాత్రమే పిలిచినట్లు స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ లాయర్ జోక్యం చేసుకుని సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసిచ్చిన‌ప్పుడు సాక్షిని సీబీఐ అరెస్ట్‌ చేసేందుకు లేదన్నారు. దీనికి సీబీఐ లాయర్ సానుకూలంగా స్పందించారు.

దాంతో అవినాష్‌ను అరెస్టు చేయకూడదని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కేసును 13వ తేదీకి వాయిదా వేశారు. మొత్తానికి వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచిందని అర్థ‌మవుతోంది. అనుమానితులను లేదా నిందితులను మాత్రమే అరెస్ట్‌ చేసే అవకాశముంది కాని సాక్ష్యులను ఎప్పుడూ అరెస్ట్‌ చేయరు. కాబట్టి సీబీఐ లాయర్ అంగీకరించిన ప్రకారమే సాక్షిగా వచ్చిన ఎంపీని అరెస్ట్‌ చేసే అవకాశంలేదు.

తాజాగా వివేకా హత్యకేసులో అసలు కారణాలు ఇవి అని ఎంపీ చాలా చెప్పారు. వివేకా రెండో వివాహం, ఆస్తులు రాయించుకోవటం, మొదటి భార్య, కూతురు, అల్లుడితో వివేకాకు గొడవలు, వివేకా, మొదటి భార్య చాలాకాలంగా విడిగా ఉండటం లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. వీటన్నింటినీ సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయటంలేదో తనకు అర్థంకావటంలేదన్నారు. ఇదే విషయాలను కోర్టులో కూడా చెప్పారట. దాంతో వివేకా హత్యకేసు కీలక మలుపులు తిరిగే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  11 March 2023 6:24 AM GMT
Next Story