Telugu Global
Andhra Pradesh

ఇంట్లోనే గంజాయి వ్యాపారం.. వైసీపీ ఎంపీటీసీ అరెస్ట్

ఎంపీటీసీ గోవింద్ ను తప్పించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. కేసులో నిందితుడిగా గోవింద్ కాకుండా 70 ఏళ్ల అతడి తండ్రి పేరును చేర్చేలా పోలీసులపై ఒత్తిడి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది.

ఇంట్లోనే గంజాయి వ్యాపారం.. వైసీపీ ఎంపీటీసీ అరెస్ట్
X

బాపట్ల జిల్లాలో ఒక వైసీపీ ఎంపీటీసీ గంజాయి వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చిన్నగంజాం మండలం మోటుపల్లి ఎంపీటీసీ సభ్యుడు కొండూరి గోవింద్ తన ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని తెలుసుకున్న పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. పదే పదే పట్టుబడుతున్న ఒక నేరస్తుడు ఇచ్చిన సమాచారం మేరకు గోవింద్ ఇంటి వద్దకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు.

తమకు గంజాయి కావాలని మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులు అడగ్గా గోవిందు ఇంటిలో ఉన్న ఒక యువకుడు గంజాయి పొట్లాలు తీసుకొచ్చి ఇచ్చారు. దాంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని బాపట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అయితే ఈ కేసు నుంచి ఎంపీటీసీ గోవింద్ ను తప్పించేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వస్తున్నాయి. కేసులో నిందితుడిగా గోవింద్ కాకుండా 70 ఏళ్ల అతడి తండ్రి పేరును చేర్చేలా పోలీసులపై ఒత్తిడి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే అప్పటికే పోలీసులు గంజాయిని పట్టుకోవడం, గోవిందును అరెస్టు చేయడం, మీడియాలో కథనాలు కూడా రావడంతో ఈ ఎత్తుగడ పారలేదని చెప్తున్నారు .

చిన్నగంజాం పోలీస్ స్టేషన్లో ఎంపీటీసీ గోవింద్ తండ్రిపై ఇదివరకే గంజాయి విక్రయానికి సంబంధించిన కేసు ఒకటి ఉంది. ఇటీవల సూర్యలంక బీచ్ వద్ద ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని పోలీసులు విచారించగా మూలాలు వైసీపీ ఎంపీటీసీ గోవింద్ ఇంటి వద్దకు చేరాయి. శనివారం మఫ్టీలో వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు తమకు గంజాయి కావాలంటూ కోరగా వారి దగ్గర నుంచి గోవింద్ స్వయంగా డబ్బులు తీసుకున్నాడు.

ఆ తర్వాత అతడి ఇంటిలో పనిచేస్తున్న ఒక కుర్రాడు గంజాయి తీసుకొచ్చి మఫ్టీలో ఉన్న పోలీసులకు ఇచ్చాడు. గోవిందుని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లిన వెంటనే కేసు నమోదు చేయకుండా వదిలి పెట్టాల్సిందిగా కొందరు నాయకులు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చారు. కానీ పోలీసులు కఠినంగా వ్యవహరించి గోవిందును వదిలిపెట్టలేదు.

First Published:  8 Jan 2023 3:22 AM GMT
Next Story