Telugu Global
Andhra Pradesh

ఏపీలో మందుబాబులకు మరిన్ని ఆఫర్లు..

పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌ లెట్లకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతితో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

ఏపీలో మందుబాబులకు మరిన్ని ఆఫర్లు..
X

ఏపీలో మందు బాబులకు మరిన్ని ఆఫర్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆమధ్య ఏపీలో సరైన బ్రాండ్లు లేక, రేట్లు ఎక్కువ కావడంతో పక్క రాష్ట్రాలవైపు చూసేవారు చాలామంది. ఆ తర్వాత ఆ ఇబ్బంది కూడా తొలగిపోయింది. తాజాగా ఇప్పుడు మరిన్ని ఆఫర్లు ఇస్తూ ఏపీలో మందుబాబులకు శుభవార్త చెప్పింది సర్కారు.

ఇప్పటి వరకూ ఏపీలో మందుషాపుకి వెళ్తే జేబులో డబ్బులుండాల్సిందే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఫోన్ పే, గూగుల్ పే.. ఇవేవీ అక్కడ పనిచేయవు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఏడాదికి ఖరారు చేసిన నూతన మద్యం విధానంలో డిజిటల్ చెల్లింపుల విధానం తెరపైకి తెచ్చింది. మద్యం ఆదాయంలో మరింత పారదర్శకత కోసమే ఈ పద్ధతి అమలులోకి తెచ్చామంటున్నారు అధికారులు. కొత్త విధానం 2023 సెప్టెంబర్-30వరకు అమలులో ఉంటుందని చెప్పారు.

వాక్ ఇన్ స్టోర్లు..

మందు తాగేవాళ్లలో చాలామంది నేరుగా షాపులకి వెళ్లి బాటిళ్లు కొనుక్కోరు. సిగ్గు, మొహమాటం, లైన్లో నిలబడాలంటే పరువు తక్కువ అనుకునేవారు ఎవరితో అయినా తెప్పించుకుంటారు. కానీ ఇటీవల ఏపీలో వాక్ ఇన్ స్టోర్లు అంటూ సూపర్ మార్కెట్ ల తరహాలో వైన్ షాపులు వచ్చేశాయి. దీంతో చాలామంది నేరుగా షాపులోకి వెళ్లి నచ్చిన బ్రాండ్లను ఎంపిక చేసుకుని తెచ్చుకుంటున్నారు. ఈ వాక్ ఇన్ స్టోర్లకు డిమాండ్ బాగా పెరగడంతో వాటి సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మద్యం పాలసీ ప్రకారం మరిన్ని వాక్ ఇన్ స్టోర్లు రాబోతున్నాయి.

పర్యాటక కేంద్రాల్లో లిక్కర్‌ అవుట్‌ లెట్లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతితో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏపీలో 2934 వైన్ షాపులున్నాయి. కొత్తగా వాక్ ఇన్ స్టోర్లు, పర్యాటక ప్రాంతాల్లో ఔట్ లెట్లు అన్నీ కలిపినా ఈ సంఖ్య దాటకూడదని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడంలేదు. గ్రామాల్లో బెల్ట్ షాపులకోసం వేలం పాటలు జరుగుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. కొత్త మద్యం పాలసీతో మందుబాబులు నిషాతోపాటు మరింత ఖుషీ అవుతారని కూడా స్పష్టమవుతోంది.

First Published:  1 Oct 2022 2:21 AM GMT
Next Story