Telugu Global
Andhra Pradesh

ఏపీపై మోడీ సర్కారు పగపట్టిందా ?

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కోదాన్ని ఏదో కారణంతో మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోంది. ముందు ప్రత్యేకహోదాపై దెబ్బకొట్టింది. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది.

ఏపీపై మోడీ సర్కారు పగపట్టిందా ?
X

ఢిల్లీ స్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఏపీ ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడీ సర్కార్ ఏదో పగపట్టినట్టు అనుమానంగా ఉంది. ఇంతకాలం నాన్చుతూ వస్తున్న రైల్వేజోన్ ఏర్పాటు ఆశలపైన కూడా నీళ్ళు చల్లేసింది. విభజన హామీల అమలుపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండురాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వేశాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ఏమాత్రం లాభదాయకం కాదని తమ అధ్యయనంలో తేలిందని చెప్పారు. అందుకనే డీపీఆర్ ను ఆమోదించలేదని తేల్చేశారు.

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కోదాన్ని ఏదో కారణంతో మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేస్తోంది. ముందు ప్రత్యేకహోదాపై దెబ్బకొట్టింది. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. తర్వాత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులను నిలిపేసింది. చివరకు రైల్వేజోన్ స్ధానంలో దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు రెడీ అంటూ అప్పుడప్పుడు ప్రకటనలిచ్చింది. డీపీఆర్ పరిశీలనలో ఉందని స్వయంగా పార్లమెంటులోనే చెప్పింది. చివరకు ఇది కూడా సాధ్యంకాదని తాజాగా రైల్వేఉన్నతాధికారులు తేల్చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే విభజన హామీల ప్రకారం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయటానికి ఒడిశా అడ్డుపడుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న భువనేశ్వర్ జోన్ కు బిజినెస్ అంతా విశాఖ నుండే వెళుతోంది. ఒకసారి ప్రత్యేకంగా విశాఖ జోన్ ఏర్పాటైతే బిజినెస్ అంతా భువనేశ్వర్ జోన్ కు ఆగిపోయి విశాఖకే వెళుతుంది. అప్పుడు భువనేశ్వర్ జోన్ ఆర్థికంగా దెబ్బతింటుంది. షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, మైన్స్ తదితరాల కారణంగా బిజినెస్ తో భువనేశ్వర్ కళకళలాడుతోంది.

ఈ కారణంతోనే వైజాగ్ జోన్ ఏర్పాటును ఒడిశా అడ్డుకుంటోంది. అయితే ఈ విషయం బయటకు చెప్పకుండా కేంద్రం కుంటిసాకులు చెబుతూ ఇంతకాలం నెట్టుకొస్తోంది. చివరకు ఏమనుకుందో ఏమో ఫైనల్ గా ర్వైల్వేశాఖ ఉన్నతాధికారుల రూపంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కూడా సాధ్యంకాదని తేల్చేసింది. మొత్తానికి ఏపీ అంటేనే మోడీ ప్రభుత్వం ఏదో పగతో వ్యవహరిస్తోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  28 Sep 2022 12:30 AM GMT
Next Story