Telugu Global
Andhra Pradesh

బాబు - పవన్ 'చెలిమి'కి చావుదెబ్బ కొట్టిన మోడీ!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక కొత్త పరిణామం. టీడీపీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్న జనసేన పార్టీ ఆకాంక్ష నెరవేరేలా లేదు. చంద్రబాబు పట్ల బీజేపీ సానుకూల దృక్పథంతో లేదు.

బాబు - పవన్ చెలిమికి చావుదెబ్బ కొట్టిన మోడీ!
X

పవన్ కళ్యాణ్, చంద్రబాబుల 'అప్రకటిత' పొత్తును ప్రధానమంత్రి మోడీ భగ్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక కొత్త పరిణామం. టీడీపీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్న జనసేన పార్టీ ఆకాంక్ష నెరవేరేలా లేదు. చంద్రబాబు పట్ల బీజేపీ సానుకూల దృక్పథంతో లేదు. టీడీపీపై పగ ప్రతీకారాలతో బీజేపీ ఇంకా రగిలిపోతూనే ఉన్నట్టు పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ భేటీ అనంతరం వెలువడుతున్న సమాచారం ధృవీకరిస్తున్నది.

మోడీ - పవన్ భేటీ జరిగిన వైనంపై ఒక కథన ప్రకారం....

మోడీ : నెక్స్ట్ ఎలెక్షన్ లో మీరే మా సీఎం అభ్యర్థి... కష్టపడితే మనకు మంచి అవకాశాలు ఉన్నాయి.

పవన్: ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్‌ని ఎదుర్కోవాలి అంటే టీడీపీ మనము కలసి పని చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోదు. జగన్‌ని గద్దె దింపొచ్చు.

మోడీ: నిజమే... కానీ మీరు సీఎం కాలేరు కదా! పైగా చంద్రబాబు ఎలాంటి అవకాశవాదో 2014-2019 మధ్య మనమే చూశాము కదా!

పవన్: అవును సార్... కానీ జగన్ అరాచకాలు చేస్తున్నాడు. ఈ గుండా ప్రభుత్వాన్ని దించేయాలి.

మోడీ: చంద్రబాబు పరిపాలన బాగుంటుందని మనం అనుకోలేం కదా!

పవన్: ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే జగన్‌కి లాభం కదా సార్.

మోడీ: నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎవరైనా అధికారంలోకి రానీ, ఆ ఆతరువాత నుంచి మనం ఈ రాష్ట్ర ప్రజలకు వైస్సార్సీపీ, టీడీపీ కంటే బెస్ట్ ఆప్షన్ అవ్వాలి అంటే ఇప్పుడు కలసి పోటీ చేసి నెక్స్ట్ యాక్టివ్‌గా ఉంటే భవిషత్తు మనదే.రాజకీయాల్లో భవిషత్తు గురించి తప్పక పట్టించుకోవాలి. ఇప్పటికిప్పుడు వచ్చేవి చూసుకుంటే భవిషత్తులో మనమే ఉండము.

పవన్: మీ ఇష్టం సార్. మా పార్టీ ముఖ్యనాయకులతో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను.

మోడీ: మంచిది.

సంభాషణ ఇలాగే జరిగిందేమో తెలియదు.కానీ సారాంశం అయితే అదే !

బీజేపీ గేటు ముందు చంద్రబాబు చాలాకాలంగా పడిగాపులు పడుతున్నది నిజం. బీజేపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చేయని ప్రయత్నం లేదు. పడని పాట్లు లేవు. ఎన్ని విన్యాసాలు చేసినా బీజేపీ మెత్తబడడం లేదు. ఇటు ఏపీలో 'జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తా' అని జనసేన పార్టీ సారధి పవన్ కళ్యాణ్ భీష్మ‌ ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా అని అంటూనే చంద్రబాబుతో కలిసి ప్రయాణించాలని పవన్ గట్టిగా అనుకుంటున్నారు. ఈ దిశగా కొంత ముందడుగు పడినట్టు కూడా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ''పొత్తులో భాగంగా 40 కి పైగా అసెంబ్లీ స్థానాలు జనసేనాని కోరుతున్నారు. మేము 22 నుంచి 26 కన్నా ఎక్కువగా సీట్లు ఇవ్వలేమని టిడిపి నాయకులు స్పష్టం చేశారు''అనే ప్రచారం టీడీపీ శ్రేణుల్లో సాగుతోంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్లా ఉన్నా 'ఇరువురి' మధ్య ఒడంబడిక కుదిరినట్లేనని ఏపీ రాజకీయాల్లో ఒక కథనం ఉధృతంగా వ్యాపిస్తోంది. విశాఖ ఘటనలు, మంగళగిరిలో జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులు కురిపించిన వైనం, విజయవాడ నోవాటెల్ హోటల్‌లో చంద్రబాబు, పవన్ భేటీ ,ఇద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం వంటి సన్నివేశాల తర్వాత ఈ కథనం ఇంకా బలపడింది. అలాగే ఇటీవలి కాలంలో చంద్రబాబు ఎక్కడ పర్యటించినా జనసేన జెండాల రెపరెపలు కూడా కనిపిస్తున్నాయి.

జనసేనను 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన‌ప్పుడు ఆ పార్టీలో ఒక ఫైర్ కనిపించింది. సరైన సమయంలో పవన్ దిగాడని కూడా అంతా అన్నారు. నాడు ఉమ్మడి ఏపీ విభజనను ఎండగట్టిన ఒకే ఒక్కడుగా పవన్‌ను ఆంధ్రులు ఆశగా చూశారు. కానీ అంతటి పవన్ ఆవేశం సరైన వ్యూహం లేక చతికిలపడింది. 2014 ఎన్నికల వేళ కెరటంగా వచ్చిన పవన్‌లోని పవర్ మొత్తాన్ని గుంజుకుని నంజుకు తిన్నది టీడీపీ, బీజేపీలే. ఆ విధంగా గరిష్ట రాజకీయ లాభాన్ని వారు పొందితే పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతుదారుగా సైడ్ క్యారక్టర్ పాత్రకు పరిమితం కావడం పవన్ చేసిన చారిత్రాత్మక తప్పు.

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే పవన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యేవారేమో !! కానీ ఆయన ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఇక 2014 నుంచి 2019 వరకూ కూడా ఆయన రాజకీయం దశ దిశ లేకుండా, సరైన వ్యూహాలే లేకుండా సాగిపోయింది. 2017 నాటికి ఆయన బీజేపీతో స్నేహాన్ని తెంచుకుని మంచి పని చేశారని, ప్రత్యేక హోదా మీద నిగ్గదీసిన మొనగాడుగా నిలిచారని జనం అనుకున్నారు. అయితే అదే బీజేపీకి గుడ్ బై కొట్టిన టీడీపీతో అయినా పొత్తు కొనసాగించి ఉంటే 2019 ఎన్నికల ఫలితాలు మరొకరకంగా ఉండేవి. టీడీపీ కూడా ఇంత భారీగా నష్టపోయేది కాదు పవన్ రెండు చోట్లా ఓడిపోయేవారు కాదు. 2019లో ఓటమి తర్వాత అయినా ఆయన వామపక్షాలతో మైత్రిని కొనసాగించి ఏపీలో బీజేపీ వ్యతిరేక, వైసీపీ వ్యతిరేక ప్రజా ఉద్యమాలు చేసి ఉంటే క‌థ‌ వేరుగా ఉండేది. కానీ ఆయన ఆరు నెలలు తిరగకుండానే బీజేపీతో చేతులు కలిపారు. అన్నీ మరచి కౌగిలించుకున్నారు. పోనీ ఆ బీజేపీతో అయినా ఈ రోజుకీ సరైన నేస్తాన్ని కొనసాగిస్తున్నారా అంటే అదీ లేదు. ఆయన చూపులు టీడీపీ మీద ఉన్నాయి.

వైసీపీ ఓట్లు చీలకుండా చూస్తాను అని చెబుతున్న పవన్ దాని కోసం ప్రత్యేక వ్యూహన్ని అమలుచేస్తున్నారా అంటే అదీ లేదు. బీజేపీతో కటీఫ్ చెప్పలేరు.. టీడీపీతో మైత్రి ఉందో లేదో గుట్టు విప్పరు. ఇలా చల్తీ కా నాం గాడీ అన్నట్లుగానే పవన్ రాజకీయం సాగుతోంది. దాంతో పవన్ పార్టీ మీద తొలినాటి మోజు కానీ ఆ ఆకర్షణ కానీ ఏమీ లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు ఏడాదిన్నరలో రానుండగా తాపీగా పవన్ కళ్యాణ్ తమ పార్టీ సంస్ధాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. తన పార్టీలోకి చేరికలను కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ పవన్ వైఖరిని, ఆయన వ్యూహాల లేమిని చూసిన ఇతర పార్టీలలోని సీనియర్లు దూరంగానే ఉంటున్నారు.

పవన్ సీరియస్ రాజకీయాలు చేయడం లేదని, ఇప్పటికే చాలా మంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఒకనాడు మేధావులు, సీనియర్లు ఎంతోమంది కీలక నేతలు ఉన్న జనసేనలో ఇప్పుడు పెద్దగా చెప్పుకోదగిన నాయకులు ఎవరూ లేకపోవడానికి కారణం పవన్ తడబాటు అడుగులే. ఏపీలో రాజకీయ శూన్యత ఉన్నా దాన్ని భర్తీ చేయదగిన వ్యూహాలేమి పవన్ దగ్గర లేవు. 2024 ఎన్నికలు కూడా జనసేన పార్టీకి మరో బంగారు అవకాశం కల్పిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీలను చూసిన ప్రజలకు తాను 'ప్రత్యామ్నాయం' అని గట్టిగా చెప్పి నిరూపించుకోవాల్సి ఉంది.

Next Story