Telugu Global
Andhra Pradesh

మోచా మనల్ని కరుణించింది.. బంగ్లాదేశ్, మయన్మార్ కి మూడింది

దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారుతుంది.

మోచా మనల్ని కరుణించింది.. బంగ్లాదేశ్, మయన్మార్ కి మూడింది
X

వచ్చేస్తుంది మోచా అని భయపెట్టారు. అకాల వర్షాలకు తోడు తుఫాన్ బీభత్సం అనే హెచ్చరికతో రైతులు కూడా భయపడిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ అనుకున్నంత లేదు, అసలు అనుకోడానికి ఏమీ లేదన్నట్టుగా మోచా తుఫాన్ దిశ మార్చుకుంది. తెలుగు రాష్ట్రాలపై కరుణ చూపించింది. ఇప్పుడు ముప్పంతా బంగ్లాదేశ్, మయన్మార్ కేనంటున్నారు.

ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాన్ గా మోచాకి హైప్ ఇచ్చారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకటనలతోపాటు మీడియాలో వచ్చిన వార్తలతో ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. కానీ అసలు సాధారణ వర్షాలు కూడా లేకుండానే తుఫాన్ ముప్పు మనకు తప్పిపోయింది. అయితే మోచా తుఫాన్ ప్రభావం మాత్రం ఇతర ప్రాంతాలపై తప్పదనే అంచనాలున్నాయి.

దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 10 నాటికి తుఫాన్ గా బలపడుతుంది. 11వ తేదీ వరకు ఉత్తర, వాయవ్య దిశగా మోచా తుఫాన్ కదులుతుందని అంచనా. ఆ తర్వాత ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాలపై ప్రభావం లేదు..

ఏపీ, తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే బంగాళాఖాతంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ముప్పు తప్పిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలు విజృంభిస్తున్నాయి.

First Published:  9 May 2023 2:17 AM GMT
Next Story