Telugu Global
Andhra Pradesh

పొలిటికల్ విందులు జగన్ మీదే మైండ్ గేమా..?

ముద్రగడ పద్మనాభం, తోట నర్సింహం, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తమ మద్దతుదారులకు విందిస్తున్నారు. విందంటే ఏదో అల్లాటప్పాగా కాదు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.

పొలిటికల్ విందులు జగన్ మీదే మైండ్ గేమా..?
X

అధికార పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. అదికూడా ఎవరిమీదంటే స్వయానా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మీదే. ఎమ్మెల్యేలు ఏమిటి..? జగన్ మీద మైండ్ గేమ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? విషయం ఏమిటంటే.. టికెట్లు దక్కవని కన్ఫర్మ్ అయిపోయిన వారు, వస్తుందని అనుకుంటున్న వారు, టికెట్ కోసం ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళు ఒకేసారి విందు రాజకీయాలకు తెరలేపారు. నూతన సంవత్సరం సందర్భంగా తమ సొంత గ్రామాల్లో తమ సన్నిహిత నేతలు, మద్దతుదారులు, క్యాడర్ ను పిలిచి పెద్దఎత్తున విందు ఇస్తున్నారు.

సడన్ గా ఇంతమంది ఒకేసారి ఎందుకు విందు రాజకీయాలకు తెరలేపినట్లు..? అంటే జగన్ కు తమ కెపాసిటీ ఏమిటో చూపించాలనే. టికెట్లు ఇవ్వటంలేదని ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల‌కు చెప్పేశారు. అందుకనే జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్రప్రసాద్, పిఠాపురంలో పెండెం దొరబాబు తమ మద్దతుదారులను విందుకు హాజరుకావాలని ఆహ్వానాలు పంపించారు. అయితే ఆహ్వానాలు వెళ్ళిపోయిన తర్వాత దొరబాబు విందును రద్దుచేసుకున్నారు. ఎందుకంటే.. జనవరి 12వ తేదీన పుట్టిన రోజుంది కాబట్టి ఆ రోజుకు విందును వాయిదా వేసుకున్నట్లు కబురుచేశారట.

ఇదే సమయంలో ముద్రగడ పద్మనాభం, తోట నర్సింహం, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తమ మద్దతుదారులకు విందిస్తున్నారు. విందంటే ఏదో అల్లాటప్పాగా కాదు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. జగ్గంపేటలో చంటిబాబుకు బదులు తోట పోటీచేయబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రత్తిపాడులో ఎవరు పోటీచేసేది తేలకపోయినా తన భార్య లేదా కూతురికి టికెట్ ఇవ్వాలని పర్వత పదే పదే కోరుతున్నారు.

అలాగే రామచంద్రాపురంలో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణకు బదులు పిల్లి కొడుక్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటున్నారు. అందుకనే పిల్లి కూడా విందిస్తున్నారు. అలాగే ముద్రగడ తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకనే మద్దతుకోసం తన వాళ్ళందరినీ పిలిచి విందిస్తున్నారట. ఏదేమైనా టికెట్లు సాధించాలన్న ఉద్దేశ్యంతోనే తమ బలమిది అని జగన్ కు చూపించేందుకు బలప్రదర్శన అని చెప్పకుండా విందు రాజకీయాలకు తెరలేపినట్లున్నారు. మరి ఈ డెవలప్మెంట్లను జగన్ గమనిస్తున్నారా..?

First Published:  1 Jan 2024 5:16 AM GMT
Next Story