Telugu Global
Andhra Pradesh

ఆ ఆలోచనే లేదు.. గన్నవరం నుంచే- వంశీ

వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకున్నాన‌ని అన్న చంద్రబాబు మాటలకు స్పందించిన వంశీ.. మోసం, వెన్నుపోటు, జూదం, వ్యభిచారం ఒకసారి చేసినా ఒకటే.. వంద సార్లు చేసినా ఒకటేనన్నారు.

ఆ ఆలోచనే లేదు.. గన్నవరం నుంచే- వంశీ
X

2024లో వైసీపీ తరపున గన్నవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సీఎం కూడా ఎంపీగా పోటీ చేయాలని తనకు సూచించ‌లేద‌న్నారు.

ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ ఇద్దరూ గొప్ప నేతలని.. పేర్లు మార్చినా, తీసేసినా వారి పేరు ప్రతిష్టలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వర్శిటీ పేరు మార్పును తాను వ్యతిరేకించలేదని.. కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేశానన్నారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టి 30ఏళ్లు అవుతున్నందున అలాగే ఉంచాలని కోరామని.. ఆరోగ్య శ్రీ, మెడికల్ కాలేజీలు కొత్తగా వైఎస్‌ఆర్‌ హయాంలో, ఇప్పుడు వచ్చాయి కాబట్టి పేరు మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పారన్నారు.

కొడాలి నాని, తాను విజ్ఞప్తి చేసినప్పటికీ.. అప్పటికే నిర్ణయం జరిగిపోయిందన్నారు వంశీ. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు ఏమీ చేయలేకపోయామని.. జగన్ వచ్చాక జిల్లాకే పేరు పెట్టారని.. కాబట్టి ఆయన్ను ప్రశ్నించే హక్కు టీడీపీకి ఎక్కడుంటుందని ప్రశ్నించారు. కనీసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరును చంద్రబాబు ఎందుకు పెట్టలేదని నిలదీశారు.

అమరావతి భూములను అభివృద్ధి చేయాలంటేనే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని.. కేంద్రం లక్ష కోట్లు ఇచ్చే అవకాశమే లేదన్నారు. రాష్ట్రం సొంతంగా భరించే పరిస్థితి కూడా లేదన్నారు. అమరావతిలో నిజమైన రైతులు, బోగస్ రైతులు ఇద్దరూ ఉన్నారన్నారు.. అలాంటి బోగస్ రైతులు ఈ ఉద్యమంలోకి దూరడంతోనే పవిత్రత దెబ్బతిందన్నారు.

2009లో జూ.ఎన్టీఆర్‌ కేరీర్‌ను పణంగా పెట్టి టీడీపీకి ప్రచారం చేశారని.. పెద్ద యాక్సిడెంట్‌ అయి భగవంతుడి దయ వల్ల తిరిగి కోలుకున్నారని చెప్పారు. అంత కష్టపడితే ఆ తర్వాత టీడీపీ పత్రికల్లో జూ.ఎన్టీఆర్‌ వెళ్లిన ఊర్లలో టీడీపీ ఓడిపోయిందని పదేపదే వార్తలు రాయించారన్నారు. లోకేష్‌ను ప్రమోట్‌ చేయడానికి రాశారా.. లేదా.. అన్నది అందరికీ తెలుసన్నారు. అయినా సరే అవి మనసులో పెట్టుకోకుండా 2014లో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వస్తే వేదిక మీదకు కూడా పిలవలేదన్నారు.

వెన్నుపోటు సమయంలో ఎన్టీఆర్‌ కాళ్లు పట్టుకున్నాన‌ని అన్న చంద్రబాబు మాటలకు స్పందించిన వంశీ.. మోసం, వెన్నుపోటు, జూదం, వ్యభిచారం ఒకసారి చేసినా ఒకటే.. వంద సార్లు చేసినా ఒకటేనన్నారు. పార్టీ పరిరక్షణ కోసం చంద్రబాబు చేసి ఉంటే.. నెలలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎందుకు బయటకు పోయారు?. హరికృష్ణ ఎందుకు విభేదించారు?. పురందేశ్వరి కాంగ్రెస్‌, బీజేపీలోకి ఎందుకు వెళ్లారు?. అని వంశీ ప్రశ్నించారు.

First Published:  17 Oct 2022 9:01 AM GMT
Next Story