Telugu Global
Andhra Pradesh

వైసీపీకి ఈ ఎమ్మెల్యే కూడా దూరమైనట్లేనా?

ఇప్పుడు విషయం ఏమిటంటే శ్రీదేవి సిఫారసుతో నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ రద్దయ్యింది. అలాగే నియోజకవర్గం ఇన్‌చార్జిగా కత్తెర సురేష్‌ను నియమించారు. ఎమ్మెల్యే లేకుండానే రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశాలు జరిగిపోతున్నాయి.

వైసీపీకి ఈ ఎమ్మెల్యే కూడా దూరమైనట్లేనా?
X

రాజధాని పరిధిలోని ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వ్యవహారం విచిత్రంగా తయారైంది. తాడికొండ ఎమ్మెల్యే కేంద్రంగా జరుగుతున్న డెవలప్మెంట్లు వ్యవహారం చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. పార్టీయే ఎమ్మెల్యేని దూరంపెట్టేసిందా? లేకపోతే ఎమ్మెల్యేనే పార్టీకి దూరమవుతున్నారా అన్నది కీలకం ఇక్కడ. ఇంతకీ విషయం ఏమిటంటే ఎమ్మెల్యే లేకుండానే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి.ఎమ్మెల్యే సిఫారసుతో వేసిన కమిటిలు రద్దవుతున్నాయి. దాంతో పార్టీకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిపోతోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పుడు విషయం ఏమిటంటే శ్రీదేవి సిఫారసుతో నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ రద్దయ్యింది. అలాగే నియోజకవర్గం ఇన్‌చార్జిగా కత్తెర సురేష్‌ను నియమించారు. ఎమ్మెల్యే లేకుండానే రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశాలు జరిగిపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాతే అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుండి శ్రీదేవికి బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో గొడవలు మొదలయ్యాయి. తర్వాత నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కూడా గొడవలే.

ఈమధ్యనే డొక్కా స్ధానంలో సీనియర్ నేత కత్తెర సురేష్‌ను నియమిస్తే ఎమ్మెల్యేకి ఈయనతో కూడా గొడవలవుతున్నాయి. అంటే ఎమ్మెల్యేకి పార్టీలోని నేతలు ఎవరితోను పడటంలేదనే విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలు, నోటిదురుసు, ఎవరినీ కలుపుకుని వెళ్ళలేకపోవటం లాంటి లక్షణాల కారణంగానే అందరితోనూ గొడవలవుతున్నట్లు అధిష్టానం గ్రహించింది.

ఇదే సమయంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా బాగా పెరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీదేవికి టికెట్ ఇస్తే గెలుపు కష్టమని అర్థ‌మవటంతోనే పార్టీకి ఇన్‌చార్జిల‌ను నియమించి వ్యవహారాలన్నీ నడుపుతున్నారు. దీంతో పార్టీ మీద ఎమ్మెల్యేకి పీకల్లోతు మండిపోతోంది. తన అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తే మొదటికే మోసం వస్తుందని ఎమ్మెల్యేకి అర్థ‌మైంది. అందుకనే ప్రస్తుతానికి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏదో రోజు తనకు జగన్ అపాయిట్మెంట్ ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

First Published:  31 Jan 2023 5:33 AM GMT
Next Story