Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే ఇంటికి ఎంపీ నిధులతో రోడ్డు.. కారణం వింటే నవ్వాగదు

ఇంటికోసం భారీగా ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే రాపాక, రోడ్డు వేసే విషయంలో మాత్రం కక్కుర్తి పడ్డారు. తన జేబులో డబ్బులెందుకు ఖర్చు పెట్టాలనుకున్నారు. ప్రభుత్వ నిధుల్ని వాడేశారు.

ఎమ్మెల్యే ఇంటికి ఎంపీ నిధులతో రోడ్డు.. కారణం వింటే నవ్వాగదు
X

నాయకులన్నాక చిలక్కొట్టుడు తెలిసిందే. కానీ కొంతమంది తెలివిగా చేస్తారు, కొంతమంది వ్యవహారం బయటపడిన తర్వాత కవర్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి ఎదురైంది. దర్జాగా తన ఇంటికి ప్రభుత్వ నిధులతో రోడ్డు వేయించుకున్నారు రాపాక. తీరా విషయం బయటపడి ఎంక్వయిరీ మొదలయ్యాక.. ఆ రోడ్డునే పంచాయతీకి రాసిచ్చేశానని చెబుతున్నారు. అందుకే పంచాయతీ అధికారులు రోడ్డు వేశారని అందులో తప్పేముందని లాజిక్ తీస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే రాపాక ఓ ఇల్లు కట్టుకున్నారు. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఆ ఇంటిలోపలికి పంచాయతీ రోడ్డు నుంచి మరో కొత్త రోడ్డు నిర్మించారు. ప్రహరీ లోపలినుంచి మొదలై ఇంటి గుమ్మం వరకు ఆ రోడ్డు వెళ్తుంది. ఇక్కడే చిన్న మతలబు ఉంది. ఇంటికోసం భారీగా ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే రాపాక, రోడ్డు వేసే విషయంలో మాత్రం కక్కుర్తి పడ్డారు. తన జేబులో డబ్బులెందుకు ఖర్చు పెట్టాలనుకున్నారు. ప్రభుత్వ నిధుల్ని వాడేశారు. ఎంపీ అభివృద్ధి నిధులను దారి మళ్లించారు. ఎంచక్కా అధికారుల్ని దగ్గర పెట్టుకుని రోడ్డు వేయించుకున్నారు.

అయితే స్థానికులు ఈ విషయం పసిగట్టారు. ఇదెక్కడి ఘోరమంటూ పెదవి విరిచారు. నిధుల దుర్వినియోగంపై కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏప్రిల్‌ 11న కేంద్ర మంత్రిత్వశాఖకు ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో ఎంపీ నిధుల్ని దుర్వినియోగం చేశారని 12 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే ఇంటి ఆవరణలో రోడ్డు వేయించుకున్నారని చెప్పారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ చంటిబాబు ఈ విషయాన్ని ధృవీకరించారు. నిధుల దుర్వినియోగంపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలంటూ తమకు ఆదేశాలు అందాయన్నారు.

కామెడీగా సమాధానమిచ్చిన ఎమ్మెల్యే..

ఎమ్మెల్యే రాపాక మాత్రం నిధుల దుర్వినియోగం జరగలేదంటున్నారు. దానికి ఆయన ఓ లాజిక్ వెదికారు. నిత్యం తనను కలవడానికి వస్తున్న ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తన ఇంటి లోపల రహదారిని పంచాయతీకి రాసిచ్చానన్నారు రాపాక. అలా పంచాయతీకి సంబంధించిన స్థలంలో ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారని అందులో తప్పేమీ లేదన్నారు. తనది కాని దారిలో తానెందుకు రోడ్డు వేయిస్తానంటున్నారు. అందుకే ప్రభుత్వ నిధులు ఖర్చు చేశామన్నారు. ఈ లాజిక్ విని అధికారులే తెల్లబోయారు.

First Published:  10 May 2023 5:46 AM GMT
Next Story