Telugu Global
Andhra Pradesh

నాపై ఈ పెత్తనం ఏంది?.. దేనికైనా మేం సిద్ధం- నెల్లూరు జిల్లాలో స్వ‌రం పెంచిన‌ మూడో ఎమ్మెల్యే

పది రోజుల క్రితమే సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని.. అయినా పట్టించుకోలేదన్నారు. ఈసారి ముఖ్యమంత్రి దగ్గర గానీ, జిల్లా మంత్రి దగ్గర గానీ కూర్చుంటే తాడోపేడో తేల్చుకుంటా అంటూ ఊగిపోయారు.

నాపై ఈ పెత్తనం ఏంది?.. దేనికైనా మేం సిద్ధం- నెల్లూరు జిల్లాలో స్వ‌రం పెంచిన‌ మూడో ఎమ్మెల్యే
X

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానానికి నిద్రలేకుండా చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓపెన్ అయిపోయారు. వారు పార్టీ వీడటం ఖాయమైంది. శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుండగానే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గొంతు పెంచారు.

నియోజకవర్గ పరిశీలకుడి విషయంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన పరిశీలకుడు నియోజకవర్గంలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తాను వైఎస్ కుటుంబానికి తొలి నుంచి విధేయుడిగా ఉన్నానని.. అలాంటిది తనపైనే పెత్తనం ఏంటని మండిపడ్డారు. నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తీరును జగన్‌ వద్దే తేల్చుకుంటానన్నారు చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.

వైఎస్ కుటుంబం కోసం ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసిన వ్యక్తిని తాననన్నారు. పెద్దపెద్ద కొమ్ములు తిరిగిన‌వారే తమపై పెత్తనం చెలాయించలేక‌పోయార‌ని, ధనుంజయరెడ్డి లాంటి వారి పెత్తనాన్ని అస్సలు సహించే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంతో తాము దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఇదో దుర్మార్గమైన విధానం అని.. అదే తిరిగి కొట్టుకుంటుందని శాపనార్థాలు పెట్టారు ఎమ్మెల్యే. పది రోజుల క్రితమే సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లానని.. అయినా పట్టించుకోలేదన్నారు. ఈసారి ముఖ్యమంత్రి దగ్గర గానీ, జిల్లా మంత్రి దగ్గర గానీ కూర్చుంటే తాడోపేడో తేల్చుకుంటా అంటూ ఊగిపోయారు.

ధనుంజయ రెడ్డి టీడీపీ మనిషి అని మేకపాటి ఆరోపించారు. తానంటే గిట్టని వారి దగ్గరకు వెళ్లి వారిని రెచ్చగొట్టే పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. ధనుంజయరెడ్డి పోలీస్ స్టేషన్లకు వెళ్లి టీడీపీ వారికి పనులు చేయండి అని చెబుతున్నారన్నారు. ధనుంజయ రెడ్డి అనే వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్నారని.. అందుకే అతడిని తొలగించాలని ఇప్పటికే జగన్‌కు చెప్పానన్నారు. ధనుంజయ రెడ్డిని తప్పించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. ధనుంజయ రెడ్డి చేస్తున్న నీచమైన పనులు మరెవరూ చేయడం లేదన్నారు.

First Published:  1 Feb 2023 3:03 PM GMT
Next Story