Telugu Global
Andhra Pradesh

నా బిడ్డలేం పాపం చేశారు? - మాజీ మంత్రి శాపనార్థాలపై శ్రీధర్ రెడ్డి

వైఎస్ కుటుంబానికి ఎంతో సాయం చేసిన సోనియాగాంధీపై తిరుగుబాటు చేయడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం జగన్‌ తిరగబడితే అది హీరోయిజమా..? మా లాంటి వారు పార్టీ నుంచి బయటకు వస్తే నమ్మకద్రోహమా..?

నా బిడ్డలేం పాపం చేశారు? - మాజీ మంత్రి శాపనార్థాలపై శ్రీధర్ రెడ్డి
X

''జగన్‌మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసింది ముమ్మాటికీ ద్రోహమే.. శ్రీధర్‌ రెడ్డిని నమ్మొద్దు అని మాలాంటి వారు చెప్పినా జగన్ పిచ్చిమాలోకం కాబట్టి పట్టించుకోలేదు. గుడ్డిగా నమ్మేశాడు. డిసెంబర్‌ 25న నీలిరంగు బెంజి కారులో వెళ్లి చంద్రబాబుని శ్రీధర్ రెడ్డి కలిశాడు. ఈ విషయాన్ని టీడీపీ వాళ్లే మాతో చెప్పారు'' అంటూ మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్పందించారు.

తాను డిసెంబర్ 25న చంద్రబాబుని కలిసి ఉంటే ఆరోజే తనను పార్టీ నుంచి పీకేయాలి కదా అని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని పేర్నినానిని ప్రశ్నించారు. తాను చంద్రబాబును కలిసినట్టు టీడీపీ నేతలే పేర్నినానితో చెప్పి ఉంటే ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారన్నది ఇక్కడే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పేర్ని నాని టీడీపీ నేతలతో మాట్లాడుతున్నారా అని శ్రీధర్ రెడ్డి నిలదీశారు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో బాలినేని సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. తాను ఫోన్ మాట్లాడిన రామశివారెడ్డిని తీసుకొచ్చి అది రికార్డింగే అని చెప్పిస్తామన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు ఆ పని చేయించలేకపోయారని ప్రశ్నించారు. జగన్‌ తనకు టికెట్ ఇచ్చిన మాట వాస్తవమేనని.. కానీ తనను అనుమానించిన చోట ఉండకూదనే బయటకు వచ్చానన్నారు. అదే నమ్మకద్రోహం అయితే మరి వైఎస్ కుటుంబానికి ఎంతో సాయం చేసిన సోనియాగాంధీపై తిరుగుబాటు చేయడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసం జగన్‌ తిరగబడితే అది హీరోయిజమా..? మా లాంటి వారు పార్టీ నుంచి బయటకు వస్తే నమ్మకద్రోహమా..? అని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.

తాను అధికారం వద్దనుకునే బయటకు వచ్చానని.. మీరు, మీ రాజ్యాధికారం ఏం చేస్తుందో చేయండి అని బయటకు వచ్చానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ప్రజలు వాత పెడుతారో చూద్దామన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ చేయకపోతే ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు దీనిపై విచారణ జరపాలంటూ లేఖ రాయాలని సవాల్ చేశారు. వైసీపీ నాయకత్వం ధర్మం తప్పి వ్యవహరిస్తోందన్నారు. కోటంరెడ్డి చేసిన పాపానికి ఆయన కుటుంబం కూడా బలైపోతుందని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారని.. నిజంగా తాను తప్పు చేసి ఉంటే ఆయన చెబుతున్నట్టుగానే ఆ పాపం తనకు తగలాలనే భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసలు ఇందులో తన బిడ్డలు చేసిన పాపం ఏంటి..?. వారు నాశనం అయిపోవాలని ఎందుకు శపిస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

తాను బయటపడిన తర్వాత 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, రఘురామకృష్ణంరాజు కాకుండా నలుగురు ఎంపీలు స్వయంగా తనకే ఫోన్ చేసి మాట్లాడారని.. వారంతా వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

First Published:  3 Feb 2023 3:50 AM GMT
Next Story