Telugu Global
Andhra Pradesh

అసంతృప్తి నిజమే, కానీ..! –బాలినేని

ఈ ఎన్నికలను లెక్కలోకి తీసుకోనక్కర్లేదని పైకి చెబుతున్నా కూడా లోలోపల మాత్రం నష్టనివారణ చర్యలకు పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. పట్టభద్రుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఇప్పుడిప్పుడే నేతలు ఒప్పుకుంటున్నారు.

అసంతృప్తి నిజమే, కానీ..! –బాలినేని
X

పట్టభద్రుల ఎమ్మెల్సీలను మూడుచోట్లా కోల్పోయిన వైసీపీ, అదేమంత పెద్ద విషయం కాదని చెబుతోంది. సజ్జల, బొత్స కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం పరిధి చాలా చిన్నది అన్నారు. ఆ సమూహాన్ని రాష్ట్రమంతా వర్తింపజేయలేమని చెప్పారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మాత్రం అసంతృప్తి నిజమేనని ఒప్పుకున్నారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు తెలిపారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల్లో అసంతృప్తి ఉన్నట్టు ఈ ఎన్నిక ఫలితాలతో అర్థమైందని అన్నారు బాలినేని. అయితే రాష్ట్ర ఓటర్లలో వీరి వాటా కేవలం 2 శాతమేనని చెప్పారు. కేవలం మూటు సీట్లు మాత్రమే గెలిచిన టీడీపీ అధికారంలోకి వచ్చినట్టు సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. ప్రస్తుత ఫలితాలు ఎలా ఉన్నా 2024లో వైసీపీయే అధికారంలోకి వస్తుందన్నారు.

టార్గెట్ మారుతుందా..?

151 సీట్ల భారీ మెజార్టీలో 2019 లో వైసీపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికలు, మున్సిపాల్టీలు, ఉప ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాలు సాధించింది. అదే సమయంలో టీడీపీ ఓటుబ్యాంక్ దారుణంగా పడిపోతూ వచ్చింది. దీంతో ఈసారి 175 నియోజకవర్గాల్లో పాగా వేయాలని జగన్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. అదే ఊపుతో తల ఎగరేసిన ఎమ్మెల్యేలను పక్కనపెడుతూ వచ్చారు. పార్టీయే సుప్రీం అనే సంకేతాలిచ్చారు. కానీ ఒక్కసారిగా పట్టభద్రుల నియోజకవర్గాల విషయంలో టీడీపీకి ఊహించని విజయాలు దక్కాయి. దీంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఎన్నికలను లెక్కలోకి తీసుకోనక్కర్లేదని పైకి చెబుతున్నా కూడా లోలోపల మాత్రం నష్టనివారణ చర్యలకు పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. పట్టభద్రుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని ఇప్పుడిప్పుడే నేతలు ఒప్పుకుంటున్నారు. మరి ఈ అసంతృప్తిని తొలగించే మార్గాలను అణ్వేషిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. తప్పు తెలుసుకుని ఏడాదిలోపు దాన్ని సరిదిద్దుకోగలిగితేనే 2024 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. 175 అనే టార్గెట్ కలగానే మిగిలిపోతుంది.

First Published:  20 March 2023 2:28 AM GMT
Next Story