Telugu Global
Andhra Pradesh

యూఎస్‌లో ఇంటి నుంచి పారిపోయిన తెలుగు బాలిక.. 75 రోజుల తర్వాత కనుగొన్న పోలీసులు

జనవరి 17న స్కూల్‌కు వెళ్లిన తన్వీ.. ఆ తర్వాత కనపడ లేదు. పోలీసులు సీసీ కెమేరాలు పరిశీలిస్తే ఆమె బస్ ఎక్కకుండా డేవీస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్లడం మాత్రమే కనిపించింది.

యూఎస్‌లో ఇంటి నుంచి పారిపోయిన తెలుగు బాలిక.. 75 రోజుల తర్వాత కనుగొన్న పోలీసులు
X

అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబానికి చెందిన బాలిక (15) ఇంటి నుంచి పారిపోయిన 75 రోజుల తర్వాత పోలీసులు కనుగొన్నారు. ఆర్కన్సాస్ నుంచి పారిపోయిన ఆ అమ్మాయి.. 1600 కిలోమీటర్ల దూరంలోని ఫ్లోరిడాలో క్షేమంగా ఉందని.. ఇన్ని రోజులు ఆ టీనేజర్ ఎలా జీవించిందో తెలుసుకొని ఆశ్చర్యపోయినట్లు పోలీసులు తెలిపారు. ఏపీకి చెందిన మారుపల్లి పవన్, మారుపల్లి శ్రీదేవి దంపతులకు తన్వీ (15) అనే కూతురు ఉన్నది. ఇటీవల ఐటీ సెక్టార్‌లో పలువురి జాబ్స్‌ను తీసేస్తున్నారు. తన తండ్రి జాబ్ కూడా పోతే అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వెళ్లిపోవాల్సి వస్తుందేమో అనే భయంతో తన్వీ ఇంటి నుంచి పారిపోయింది.

జనవరి 17న స్కూల్‌కు వెళ్లిన తన్వీ.. ఆ తర్వాత కనపడ లేదు. పోలీసులు సీసీ కెమేరాలు పరిశీలిస్తే ఆమె బస్ ఎక్కకుండా డేవీస్ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వెళ్లడం మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఆమె జాడ లేదు. అయితే లైబ్రెరీ అంటే విపరీతమైన ప్రేమ కలిగిన తన్వీ.. ఫ్లోరిడాలోని ఒక లైబ్రరీలోనే కనపడటం గమనార్హం. కాగా, పోలీసులు తన్వీ ఇన్ని రోజులు ఎలా జీవించిందో చెప్పారు. స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నడవటం మొదలు పెట్టింది. రోడ్, రైల్ ట్రాక్స్ పక్కన నడుస్తూనే ఉండేదని.. ఎక్కడైన ట్రైన్ దొరికితే ఎక్కి దిగేదని చెప్పారు.

అడవులు, కొండల్లో కూడా నడుచుకుంటూ వెళ్లిందని.. చివరకు ఒక ట్రైన్ పట్టుకొని కన్సాస్ సిటీకి చేరుకుందని పోలీసులు చెప్పారు. ఆర్కన్సాస్ నుంచి కన్సాస్ సిటీకి ఐదు రోజుల పాటు జర్నీ చేసిందని పోలీసులు వెల్లడించారు. అక్కడ ఒక హోమ్ లెస్ షెల్టర్‌లో చేరిందని చెప్పారు. తన ఐడెంటిటీ తప్పుగా చెప్పి షెల్టర్‌లో దాదాపు రెండు నెలల పాటు ఉందన్నారు. ఆ తర్వాత ఫ్లోరిడా రాష్ట్రంలోని తాంపాకు ఒక బస్ ఎక్కి వెళ్లిపోయింది. తాంపాలో ఎవరూ నివసించని, శిథిలమైన ఇంటిని వెతుక్కున్నది. అక్కడే ఉంటూ.. ప్రతీ రోజు లోకల్ లైబ్రరీకి వెళ్లేదని పోలీసులు చెప్పారు.

లైబ్రరీకి వెళ్లి ఉద్యోగాలు అన్వేషించేదని అన్నారు. అయితే అప్పటికే తన్వీ తల్లిదండ్రులు ఒక వీడియో విడుదల చేయడమే కాకుండా, పోలీసులు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్ట్రెన్‌కు సమాచారం అందించారు. వాళ్లు కూడా తన్వీ ఫొటోను లైబ్రెరీల్లో ఉంచారు. తన్వీ వెళ్లిన లైబ్రెరీకే వెళ్లిన ఒక వ్యక్తి.. ఆమె ఫొటోను తీసి పోలీసులకు పంపించాడు. ఆ బాలిక తన్వీనే అని గుర్తు పట్టిన పోలీసులు వెంటనే తాంపా వెళ్లి ఆర్కన్సాస్‌కు తీసుకొని వచ్చారు. తన్వీ ఒక 'లిటిల్ రాంబో' అని.. అలాంటి బాలికను ఇంత వరకు తాము చూడలేదని పోలీసులు చెప్పారు. రాత్రి పగలు ఒంటరిగా రోడ్లు, అడవులు, రైల్వే ట్రాకుల వెంట నడిచిందని.. ఆమె ట్రెయిన్, బస్సులో ప్రయాణించిన దూరం తక్కువే అని చెప్పారు.

కాగా, తన్వీ తల్లిదండ్రులు పవన్, శ్రీదేవీ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. తల్లి శ్రీదేవీ ఉద్యోగం పోవడంతో గతేడాది నవంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చింది. తర్వాత డిపెండెంట్ వీసా మీద అమెరికా వెళ్లింది. ఇక నాన్న పవన్ ఉద్యోగం కూడా పోతే శాశ్వతంగా ఇండియాకు వెళ్లిపోవాలనే భయంతోనే తన్వీ ఇంట్లో నుంచి పారిపోయింది. కాగా, తన్వీ ఇంట్లో నుంచి వెళ్లి పోయిన తర్వాత.. తన ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదని.. నువ్వు వెంటనే ఇంటికి రావాలని తండ్రి వీడియో పోస్టు పెట్టారు. తన్వీ ఆచూకీ తెలిపిన వారికి 25000 డాలర్ల పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించారు. చివరకు తన్వీ తనకు ఇష్టమైన లైబ్రరీ అనే వ్యాపకం వల్లే దొరకిందని పోలీసులు కూడా తెలిపారు.

First Published:  1 April 2023 1:17 AM GMT
Next Story