Telugu Global
Andhra Pradesh

మరోసారి మోసానికి బాబు, పవన్‌ రెడీ.. - మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్‌

2014లో 148 హామీలిచ్చి అమలు చేయని బాబు.. ఇప్పుడు మరోసారి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలూ బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు.

మరోసారి మోసానికి బాబు, పవన్‌ రెడీ.. - మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్‌
X

బీసీలను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు, పవన్‌ రెడీ అయ్యారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్‌ పేరుతో ఇచ్చిన హామీలపై వారు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గతంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. 2014లో బీసీలకు చంద్రబాబు 148 వాగ్దానాలిచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు.

బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసులనే వైసీపీ స్లోగన్‌ని కాపీ కొట్టారని మంత్రులు ధ్వజమెత్తారు. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాసులని వైసీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్‌లో చెప్పిన మాటలను వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని వారు తెలిపారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామని వివరించారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని తెలిపారు.

2014లో 148 హామీలిచ్చి అమలు చేయని బాబు.. ఇప్పుడు మరోసారి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలూ బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఎలాంటి విలువా లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీలను బాగా వాడుకుని.. చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అడ్డుకున్నది చంద్రబాబేనని మండిపడ్డారు. బీసీలకు ఇళ్ల పట్టాలు పంపిణీపైనా కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలన్స్‌ వస్తుందన్న వ్యక్తి బాబు అని విమర్శించారు.

First Published:  6 March 2024 3:52 AM GMT
Next Story