Telugu Global
Andhra Pradesh

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి బాబే

బీసీల రక్షణ చట్టాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పుడో తెచ్చారని ఆయన చెప్పారు. నాయీ బ్రాహ్మణులను ‘మంగలి’ అని పిలిస్తే శిక్షార్హుడవుతారని చెప్పారు.

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి బాబే
X

బీసీలను అణగదొక్కడంలో మొదటి ముద్దాయి చంద్రబాబేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ విమర్శించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తానని లోకేష్‌ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మొదటి ముద్దాయి చంద్రబాబు అని ఆయన చెప్పారు. రాజమండ్రిలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీలైన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని బాబు అన్నారని గుర్తుచేశారు. మత్స్యకారులను తోలు తీస్తానన్నారని చెప్పారు. ఇప్పుడు మాత్రం మీరు బీసీల రక్షణ చట్టం అంటూ మాయమాటలు చెబితే ఎవరు నమ్ముతారని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు రక్షణ చట్టం తెస్తానన్న చెబుతున్న లోకేష్‌ చరిత్ర తెలుసుకోవాలని మంత్రి చెల్లుబోయిన సూచించారు. ఒకవేళ అలాంటి చట్టమే తెస్తే.. ముందుగా దానిని చంద్రబాబుపైనే ప్రయోగించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఎస్సీల చట్టాన్ని బాబు అపహాస్యం చేశాడని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

బీసీల రక్షణ చట్టాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పుడో తెచ్చారని ఆయన చెప్పారు. నాయీ బ్రాహ్మణులను ‘మంగలి’ అని పిలిస్తే శిక్షార్హుడవుతారని చెప్పారు. లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో బీసీలకు ప్రత్యేక కేటాయింపులంటున్న లోకేష్‌.. బీసీలకు 33.33 శాతం సీట్లు కేటాయిస్తానన్న బాబు అలా కేటాయించకుండా బీసీలను మోసం చేశాడని చెప్పారు. ఆ విధంగా బాబు శిక్షార్హుడా.. కాదా అని ఆయన ప్రశ్నించారు. మార్కెట్‌ కమిటీల్లో 33.3 శాతం ఇస్తానన్నాడు..ఇచ్చాడా? అని నిలదీశారు. బీసీలకు చైతన్యం ఉండదని నీ అభిప్రాయమా..? నువ్వు బీసీలను చైతన్యవంతులను చేసేదేంటి? మేమెప్పుడూ చైతన్యవంతులమే అని మంత్రి తెలిపారు. బీసీలు చైతన్యవంతులయ్యారు కాబట్టే మీకు 23 సీట్లిచ్చారంటూ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ మార్కెట్‌ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లను బీసీలకు కేటాయించారని మంత్రి గుర్తుచేశారు. 56 బీసీ కార్పొరేషన్లతో పాటు వివిధ కార్పొరేషన్లు, పదవుల్లో బీసీలకు 50 శాతానికి పైగా పదవులిచ్చి వారి ఎదుగుదలకు తోడ్పడ్డారని ఆయన చెప్పారు.

బీసీలను పక్కన పెట్టి ఏ అర్హత లేని నిన్ను మంత్రిని చేసి మూడు శాఖలు కట్టబెట్టిన మీరా మాట్లాడేది అంటూ మంత్రి లోకేష్‌ని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేయించింది నీ బాబు కాదా అని ప్రశ్నించారు. 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అధినేత జగన్‌ ప్రయత్నిస్తే కోర్టులో కేసు వేసింది మీ మనిషి ప్రతాప్‌రెడ్డి కాదా అని నిలదీశారు. బాబు పాదయాత్ర సమయంలో శెట్టిబలిజలు తమకు రెండు సీట్లు ఇవ్వాలని అడిగితే.. సీటిస్తే గెలుస్తారా అంటూ చంద్రబాబు హేళన చేశారని గుర్తుచేశారు. నేడు జగన్‌ మూడు అసెంబ్లీ స్థానాలు, 2 మండలి స్థానాలు, ఒక రాజ్యసభ ఇచ్చారని తెలిపారు. మళ్లీ లోక్‌సభ స్థానం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 2004లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వచ్చిన తర్వాత బీసీలు ఉన్నత చదువులు చదివారని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. ఐదేళ్లకోసారి ఒక ఇస్త్రీ పెట్టె ఇచ్చి బీసీలు ఇక అలానే ఉండాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. 2024లో రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరింతగా బుద్ధి చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని మంత్రి హెచ్చరించారు.

First Published:  29 Dec 2023 3:31 PM GMT
Next Story