Telugu Global
Andhra Pradesh

మీ ఎగతాళి.. గేలి.. బీసీలు మర్చిపోరు బాబూ..

బీసీలకు రాజ్యాధికారం సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టంచేశారు. జగన్‌ సమున్నత ఆశయంతో బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారని ఆయన చెప్పారు.

మీ ఎగతాళి.. గేలి.. బీసీలు మర్చిపోరు బాబూ..
X

బీసీలంటే చంద్రబాబుకు చులకనభావమని, ఆయన బీసీ నాయకులను చేసిన ఎగతాళి, గేలి ఎప్పటికీ మర్చిపోరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బాబు అధికారంలో ఉండగా.. నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలు తెలిపేందుకు వెళితే.. తోకలు కత్తిరిస్తానన్న విషయం ఎన్నటికీ మరువరని ఆయన చెప్పారు. గతంలో కాకినాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబును శెట్టిబలిజ సామాజిక వర్గ నాయకులు తమకు రెండు సీట్లు కేటాయించాలని అడిగితే.. సీట్లిస్తే గెలవగలరా అంటూ గేలి చేసిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదని మంత్రి గుర్తుచేశారు.

మంత్రి చెల్లుబోయిన మంగళవారం రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టంచేశారు. జగన్‌ సమున్నత ఆశయంతో బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ ఉన్న‌త ఆశయానికి, బీసీలను మోసం చేసే చంద్రబాబు అత్యాశకు మధ్య జరగబోతున్న పోటీ రానున్న ఎన్నికలని ఆయన వివరించారు. ఇలాంటి పోటీలో బాబును నమ్మితే బీసీలు మోసపోవడం తప్ప జరిగేదేమీ ఉండదన్నారు.

మంజునాథ కమిషన్‌ వేసినప్పుడు బీసీల తరఫున శెట్టిబలిజ సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించిందని మంత్రి వేణు గుర్తుచేశారు. రామచంద్రాపురం టౌన్, రూరల్‌ అసెంబ్లీ స్థానాలు, రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభ స్థానాలను బీసీ వర్గానికి చెందిన శెట్టిబలిజలకు సీఎం జగన్‌ కేటాయించారని ఆయన తెలిపారు. బీసీలకు అధికారం ఇవ్వడానికి ఎవరు చొరవ చూపిస్తున్నారో అర్థం చేసుకోవాలని ఆయన బీసీలను కోరారు. తాను బీసీ మంత్రిగా ఉండగా కులగణన జరగడం తన అదృష్టమని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 శాతం కులగణన పూర్తయిందని ఆయన తెలిపారు.

First Published:  14 Feb 2024 5:03 AM GMT
Next Story