Telugu Global
Andhra Pradesh

రామోజీరావును కోర్టుకు రప్పిస్తా - మంత్రి ఉషాశ్రీచరణ్

ఈనాడు పత్రిక వరుసగా రాస్తున్న కథనాలపై మంత్రి ఉషాశ్రీచరణ్ తీవ్రంగా స్పందించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కోర్టుకు రప్పిస్తానని చాలెంజ్ చేశారు.

రామోజీరావును కోర్టుకు రప్పిస్తా - మంత్రి ఉషాశ్రీచరణ్
X

జగనన్న కాలనీ భూసేకరణలో మంత్రి ఉషాశ్రీచరణ్ క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నారంటూ ఈనాడు పత్రిక వరుసగా రాస్తున్న కథనాలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కోర్టుకు రప్పిస్తానని మంత్రి చాలెంజ్ చేశారు. తాను బీసీ వర్గానికి చెందిన మహిళను కావడంతోనే ఇలాంటి కథనాలు రాస్తున్నారని ఆమె ఆరోపించారు.

తాను రైతులను బెదిరించి భూములు తీసుకున్నట్టు రామోజీరావు నిరూపించగలరా అని సవాల్ చేశారు. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లకు 9.60 ఎకరాలు కేటాయించగా... ఆ భూములను ముందే టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని మంత్రి వివరించారు. 10 లక్షల అడ్వాన్స్‌ కూడా ఇచ్చారన్నారు. ఇలాంటి పనులు చేసిన టీడీపీ నేతలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వివరించారు. తప్పుడు కథనాలు రాస్తున్న రామోజీరావుపై చట్టప్రకారం ముందుకెళ్తానని మంత్రి ప్రకటించారు.

కల్యాణదుర్గం సమీపంలోని కురాకులతోట గ్రామ పరిధిలో జగనన్న కాలనీ కోసం భూసేకరణలో క్విడ్ ప్రోకో జరిగిందన్నది ఈనాడు పత్రిక ఆరోపణ. మార్కెట్ ధర కంటే ఎక్కువగా ఎకరాకు 35 లక్షలు ఇప్పిస్తామని.. అందులో 15 లక్షలకు తమకు కమీషన్‌గా తిరిగి ఇచ్చేలా రైతులతో మంత్రి మనుషులు ఒప్పందం చేసుకున్నారని ఆ పత్రిక ఆరోపించింది. ఈ ఒప్పందాన్ని లిఖితపూర్వకంగానూ చేసుకున్నారని.. మంత్రి భర్త కారు డ్రైవర్‌ పేరున ఈ ఒప్పందాలు జరిగాయని ఆ పత్రిక ప్రచురించింది. ఈ ఆరోపణలను మంత్రి ఖండిస్తున్నారు.

First Published:  19 Jan 2023 6:22 AM GMT
Next Story