Telugu Global
Andhra Pradesh

అటు వీఐపీ దర్శనం.. ఇటు విచ్చలవిడి తిట్ల పురాణం..

రోజా మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, రాజకీయ విమర్శలకు తిరుమలని కేంద్రంగా చేసుకోవడం మాత్రం సరికాదని అంటున్నారు భక్తులు. గోవింద నామ స్మరణతో మారు మోగాల్సిన సప్తగిరుల్లో.. చవటలు, దద్దమ్మలు అనే తిట్లపురాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

అటు వీఐపీ దర్శనం.. ఇటు విచ్చలవిడి తిట్ల పురాణం..
X

వారానికోసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు మంత్రి రోజా. ఆమధ్య మందీ మార్బలం వెంటరాగా అందరికీ వీఐపీ దర్శనం సమకూర్చడంతో అదో పెద్ద గొడవ అయింది. తాజాగా మరోసారి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అటు సామాన్య భక్తులేమో క్యూ లైన్లలో రోజుల తరబడి నిల‌బ‌డ‌లేక కొట్టుకుంటున్నారు. ఇటు వీఐపీలు మాత్రం కులాసాగా ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. ఆ సౌకర్యాన్ని ఎవరూ తప్పుబట్టరు, ఆమెకు ఉన్న భక్తిని ఎవరూ శంకించరు. అయితే ఇక్కడ మంత్రి రోజా తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి వైరి వర్గాలకు చాకిరేవు పెట్టడాన్ని మాత్రం భక్తులు హర్షించట్లేదు. ఈ విషయంలో అందరు నాయకులదీ అదే తీరు, కానీ రోజా అంతకు మించి అన్నట్టుగా ప్రవర్తిస్తుండటం మాత్రం చర్చనీయాంశమవుతోంది.

మళ్లీ బాబు, మళ్లీ పవన్..

తాజాగా శ్రీవారి దర్శనం అనంతరం మరోసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి చాకిరేవు పెట్టారు రోజా. రాష్ట్రమంతా మూడు రాజధానుల విషయంలో విస్తృత చర్చ జరుగుతోందని, ప్రజలంతా అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారామె. రాలయసీమ బిడ్డగా కర్నూలుకి న్యాయరాజధాని కావాలనేది సీఎం జగన్ సంకల్పం అని తన కోరిక కూడా అదేనన్నారు. రాయలసీమకు న్యాయ రాజధాని వస్తుంటే సంతోషించాల్సిన చంద్రబాబు, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంతపాడటం దారుణం అని అన్నారు. చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోవడం ఖాయమని చెప్పారు.

చంద్రబాబుకి అవసరమైనప్పుడే పవన్ కల్యాణ్ బయటకు వస్తున్నారని, ఉత్తరాంధ్రకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ అక్కడ మూడు రోజుల యాత్ర పెట్టుకున్నారని మండిపడ్డారు రోజా. పిచ్చి కూతలు కూసి మీడియాను పక్కదారి పట్టించే ప్రయత్నం ఇదని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల కష్టాలు తెలిపే పుస్తకాలు చదవలేదా అని ప్రశ్నించారు.

అన్ స్టాపబుల్ షో పై రోజా పంచ్ లు..

అన్ స్టాపబుల్ షో లో బావబామ్మర్దులు కళ్లు ఆర్పకుండా అబద్ధాలు చెప్పారని, ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కాళ్లు పట్టుకున్నానని చెప్పడం పచ్చి అబద్ధం అని అన్నారు. తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని చంద్రబాబు చెప్పడం దెయ్యలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు రోజా.

రోజా మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ, రాజకీయ విమర్శలకు తిరుమలని కేంద్రంగా చేసుకోవడం మాత్రం సరికాదని అంటున్నారు భక్తులు. గోవింద నామస్మరణతో మారు మోగాల్సిన సప్తగిరుల్లో.. చవటలు, దద్దమ్మలు, వెన్నుపోటుదారులు, చరిత్రహీనులు.. అనే తిట్లపురాణం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. రోజా తిరుమల యాత్రలతో బిజీగా ఉండటంతో అటు గడప గడప విషయంలో సీఎం జగన్ తో చీవాట్లు తినాల్సి వచ్చింది. ఆమధ్య గడప గడప ఆబ్సెంటీస్ లిస్ట్ ని జగన్ చదివి వినిపించారు. అందులో రోజా పేరు కూడా ఉండటం విశేషం.

First Published:  14 Oct 2022 7:25 AM GMT
Next Story