Telugu Global
Andhra Pradesh

తిరుమలలో మొక్కు చెల్లించుకున్న రోజా..

చంద్రబాబు ఎంత మందిని జైలుకు పంపారో, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో, ఎంతమంది ప్రాణాలు తీశారో.. వారి ఉసురు ఇప్పుడు తగిలిందన్నారు మంత్రి రోజా. అది అక్రమ కేసు కాదని అడ్డంగా దొరికిపోయిన కేసు అని విమర్శించారు.

తిరుమలలో మొక్కు చెల్లించుకున్న రోజా..
X

చంద్రబాబు అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకులంతా దాదాపుగా సంబరాల్లో మునిగిపోయారు. అయితే అందరికంటే ఎక్కువ ఉత్సాహంగా కనిపించిన ఏకైక వ్యక్తి మంత్రి రోజా. సోషల్ మీడియా ద్వారా, మీడియాలోనూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకి రిమాండ్ ఖరారైన తర్వాత తన ఇంటి ముందు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టారు. అదే ఉత్సాహంలో ఆమె ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మొక్కు చెల్లించుకున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని స్వామివారిని కోరుకున్నట్లు ఆమె చెప్పారు.

చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపు కాదన్నారు రోజా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అడ్డంగా‌ దొరికి పోవడం వల్లే ఆయన జైలుకి వెళ్లారన్నారు. చంద్రబాబుకి శిక్ష పడాలని రాష్ట్ర ప్రజలందరూ భగవంతుడిని ప్రార్థించారని, అందుకే ఆయన కటకటాల పాలయ్యారని చెప్పారు. చంద్రబాబు ఎంత మందిని జైలుకు పంపారో, ఎంతమంది జీవితాలను నాశనం చేశారో, ఎంతమంది ప్రాణాలు తీశారో.. వారి ఉసురు ఇప్పుడు తగిలిందన్నారు. అది అక్రమ కేసు కాదని అడ్డంగా దొరికిపోయిన కేసు అని విమర్శించారు. యువతను ఆదుకోవాల్సిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాము ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు.. 2014లో బాబు వస్తే జాబు వస్తుందంటూ నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు.

జగన్ సీఎం అయ్యాక రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు, రెండు లక్షల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చాయని, రెండున్నర లక్షలమందికి పైగా వాలంటీర్లను నియమించి గౌరవ భృతి ఇస్తున్నామన్నారు మంత్రి రోజా. భారీ పరిశ్రమల ద్వారా 85,000 మందికి, ఎంఎస్ఎంఈల ద్వారా 12 లక్షల మందికి యువతకి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. నారాయణ, లోకేష్, అచ్చెన్నాయుడు కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారన్నారు. స్టేలు తెప్పించుకుని ఇంతకాలం కాలం గడిపిన చంద్రబాబుకి పాపం పండిందని, ఆయన జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సిందేన్నారు రోజా. త్వరలోనే చంద్రబాబు మరికొన్ని కేసుల్లో చిక్కుకోక తప్పదని శాపనార్థాలు పెట్టారు.

First Published:  12 Sep 2023 8:54 AM GMT
Next Story