Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేగా గెలవలేని పవన్, నన్ను ఓడించగలరా..? - రోజా

పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రోజా. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్, తనను ఓడిస్తానని, జగన్ ని ఓడిస్తానని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేగా గెలవలేని పవన్, నన్ను ఓడించగలరా..? - రోజా
X

ఇటీవల నగరి నియోజకవర్గంలో జనసేన బాగా యాక్టివ్ అయ్యింది. మంత్రి రోజాతో జనసేన నేతలు తలపడుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. చివరకు అరెస్ట్ ల వరకు వెళ్లింది వ్యవహారం. నగరిలో ఈసారి ఎలాగైనా రోజాను ఓడించాలని జనసేనాని కూడా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా.. పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్, తనను ఓడిస్తానని, జగన్ ని ఓడిస్తానని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.

నగరి నియోజవర్గం పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి రోజా. ఇంటింటికీ ఆమె స్టిక్కర్లు అంటించారు. లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు కూడా స్టిక్కర్లు అంటించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై ఆమె సెటైర్లు పేల్చారు. కలవాలనే ఆలోచన పవన్ కి, చంద్రబాబుకి ఉంటే వారిద్దరూ కలవకుండా ఎవరైనా ఆపగలరా అని ప్రశ్నించారు. ప్రజలకు పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదన్నారు. పార్టీ పెట్టి పవన్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

అలాంటివారు మూర్ఖులు..

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఎదురు తిరిగి ప్రశ్నించేవారంతా మూర్ఖులేనని అన్నారు రోజా. గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చెప్పేందుకే తాము ఇంటింటికీ వెళ్తున్నామని చెప్పారు. ఐదు అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నామని అన్నారు రోజా. తమ ప్రభుత్వంపై విశ్వాసం చూపించిన వారి అనుమతితోనే వారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ స్టికర్ ను అతికిస్తున్నామని వివరించారు. ఇదొక గొప్ప కార్యక్రమం అన్నారు రోజా. దేశ చరిత్రలోనే మొదటిసారి ఇలాంటి విస్తృత కార్యక్రమం చేపట్టామని చెప్పారు.

First Published:  7 April 2023 9:56 AM GMT
Next Story