Telugu Global
Andhra Pradesh

పవన్ సభలో చప్పట్లు మా క్రేజ్ వల్లనే

పవన్ కల్యాణ్‌కు రాష్ట్రంపై ఎలాంటి ప్రేమ లేదని చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని షూటింగ్ విరామ సమయంలో అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడేసి వెళ్ళిపోతుంటారని రోజా విమర్శించారు.

పవన్ సభలో చప్పట్లు మా క్రేజ్ వల్లనే
X

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి రోజా సంక్రాంతి వేళ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు మైండ్ దొబ్బిందని వ్యాఖ్యానించారు. అమ్మఒడి లాభమో? నష్టమో? ప్రజలందరికీ తెలుసని.. పురుషుల ఓట్లను ఆకట్టుకునేందుకే చంద్రబాబు పదేపదే నాన్న బుడ్డి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

చిరంజీవి రాజకీయాలకు పనికిరారని పిఆర్పీ పెట్టిన సమయంలోనే చెప్పానని .. అప్పుడు అందరూ రోజాది లాలీపాప్ తినే వయసని ఆమెకు రాజకీయాల గురించి ఏం తెలుసని మాట్లాడారని... కానీ ఆ తర్వాత తాను చెప్పిందే నిజమైందని రోజా వ్యాఖ్యానించారు. అనేక సంవత్సరాలు సినిమా షూటింగుల్లో తాను పక్కనుండి గమనించాను కాబట్టే చిరంజీవి రాజకీయాలకు పనికిరారని చెప్పానన్నారు.

ముగ్గురు మంత్రులను తిట్టేందుకు పవన్ కల్యాణ్ మొన్న అంత పెద్ద సభ పెట్టారా అని జనం ఉమ్మేస్తున్నారన్నారు. పవన్ ప్రసంగిస్తున్నంతసేపు సభకు వచ్చినవారు నీరసంగా కూర్చున్నారని ... ఎప్పుడైతే రోజా, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి పేర్లను ప్రస్తావించారో అప్పుడు అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టారని దీన్ని బట్టి అక్కడ వచ్చిన స్పందన కేవలం తమకున్న క్రేజీని బట్టే అని అర్థమవుతుందన్నారు.

పవన్ కల్యాణ్, నాగబాబులకు సొంత బుర్రలు పనిచేయవని అవి ఎప్పుడో బూజు పట్టిపోయాయన్నారు. పవన్ కల్యాణ్‌కు రాష్ట్రం పై ఎలాంటి ప్రేమ లేదని చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని షూటింగ్ విరామ సమయంలో అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడేసి వెళ్ళిపోతుంటారని రోజా విమర్శించారు.

దేశంలో అనేకమంది హీరోలు రాజకీయ పార్టీలు పెట్టారని వాళ్లంతా తమకు ఓటేయండి ముఖ్యమంత్రిగా సేవ చేస్తామని చెప్పుకున్నారని పార్టీ పెట్టి పక్కోడికి ఓటు వేయండి అని చెబుతున్న ఏకైక సినీ హీరో పవన్ కల్యాణ్ మాత్రమే అన్నారు. పవన్ సినిమాల్లో హీరో అయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం ముమ్మాటికి జోకర్ అని అన్నారు. చిరంజీవికి తాను నటనపరంగా అభిమానిని, ఇంత వయసు వచ్చినా కూడా పక్కన శృతిహాసన్ లాంటి హీరోయిన్‌ను పెట్టుకుని ఆమె కంటే బాగా డాన్స్ చేస్తున్నారని కితాబిచ్చారు .

సినిమాలను రాజకీయాలను కలిపి చూడవద్దని రోజా విజ్ఞప్తి చేశారు. తాను మంత్రి అయిన తర్వాత కూడా చిరంజీవి ఇంటికి వెళ్లానని కుటుంబపరంగా తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రాజకీయాలు వద్దు బాబోయ్ అని చిరంజీవి వదిలేసి వెళ్లారని కాబట్టి ఆయనపై రాజకీయ విమర్శలు తాను చేయబోనన్నారు. ఇప్పటం గ్రామంలో ఆక్రమణలు తొలగిస్తే ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చి వారిని రెచ్చగొట్టిన పవన్ .. అదే చంద్రబాబు నాయుడు సభల్లో 11 మంది చనిపోతే కనీసం ఎందుకు మాట్లాడలేదని రోజా నిలదీశారు. పైగా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి బొకే ఇచ్చి ప్యాకేజీలు మాట్లాడుకున్నారని అలాంటప్పుడు పవన్‌ను విమర్శించకుండా తాము ఎలా ఉంటామని రోజా నిలదీశారు .

రాజకీయాల్లోనికి వచ్చి ప్రజలకు ఏమి చేయకుండా చంద్రబాబు నాయుడుకు అమ్ముడుపోయి తిరిగి తమను విమర్శిస్తుంటే తామెందుకు మౌనంగా ఉంటామన్నారు. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం చేతకాని పవన్‌కు తమను ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉందన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే 75 ఏళ్ల ముసలి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ప్రజల వద్దకు వెళ్లి పలానా పని తాను చేశానని చెప్పుకోగలుగుతున్నారా అని రోజా ప్రశ్నించారు.

పేద కళాకారులని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాను వారితో కలిసి డాన్స్ చేస్తే జనసేనవాళ్లు అత్యంత నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని .. అదే పవన్ కళ్యాణ్ చిన్న వయసున్న హీరోయిన్లతో డ్యాన్సులు చేస్తే అది మాత్రం వారికి తప్పుగా కనిపించదన్నారు. పవన్, నాగబాబులకు పురుష‌ అహంకారం తలకెక్కిందన్నారు.

First Published:  14 Jan 2023 6:37 AM GMT
Next Story