Telugu Global
Andhra Pradesh

యువగళం కాదు టీడీపీకి సర్వమంగళం

లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవట్లేదని, కావాలనే టీడీపీ అనుకూల మీడియా ఆ వార్తల్ని హైలెట్ చేస్తోందని మండిపడ్డారు రోజా. ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రి హోదాలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని చూసి వైసీపీ ఎందుకు భయపడుతుందన్నారు.

Minister Roja satire on Nara Lokesh Yuvagalam Yatra
X

యువగళం కాదు టీడీపీకి సర్వమంగళం

లోకేష్ పాదయాత్రపై ఆంక్షలు విధించారంటూ ఓవైపు టీడీపీ గగ్గోలు పెడుతోంది, మరోవైపు వైసీపీ నేతలు అసలా పాదయాత్రను ఎవరు పట్టించుకుంటారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అది యువగళం కాదు, యాత్ర మొదలైతే టీడీపీకి సర్వమంగళం అని సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. లోకేష్ వార్డు మెంబర్ కు ఎక్కువ, ఎమ్మేల్యేకు తక్కువ అని అన్నారు. లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చని దానికి అభ్యంతరం ఏమీ లేదన్నారు. దశ దిశ లేకుండా ప్రజలకు ఏం చేశారో చెప్ప లేని వాళ్ళు పాదయాత్రలో అసలు ఏం మాట్లాడతారు, గతంలో తాము ఏం చేశామని చెబుతారంటూ నిలదీశారు.

అనుకూల మీడియా హైప్..

లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోవట్లేదని, కావాలనే టీడీపీ అనుకూల మీడియా ఆ వార్తల్ని హైలెట్ చేస్తోందని మండిపడ్డారు రోజా. ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రి హోదాలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని చూసి వైసీపీ ఎందుకు భయపడుతుందన్నారు. లోకేష్ ని చూసి వైసీపీ కార్యకర్తలు కూడా భయపడబోరన్నారు. సీఎం జగన్ ను తిట్టడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. జగన్ ని ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం అని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం కోసం జగన్ పాదయాత్ర చేశారని, అధికారంలోకి వచ్చాక 99 శాతం హామీలు అమలుపరిచారన్నారు. ఏ మొహం పెట్టుకుని లోకేష్ పాదయాత్ర చేస్తారన్నారు.

కన్ఫ్యూజన్ పార్టీ..

జనసేన పార్టీని కన్ఫ్యూజన్ పార్టీగా అభివర్ణించారు మంత్రి రోజా. కనీసం జిల్లా అధ్యక్షులను కూడా నియమించుకోలేని పార్టీ అది అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పొత్తు కావాలని చెబుతున్న పవన్, ఏపీలో ఎవరితో పొత్తులో ఉన్నారో కూడా తేల్చుకోలేని పవన్.. క్యాడర్ ని మరింత కన్ఫ్యూజన్లోకి నెట్టేశారని చెప్పారు రోజా.

ఎన్టీఆర్ ని అంటే ఎలా ఉంటుంది..?

అక్కినేని కుటుంబంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి రోజా ఖండించారు. అలా వ్యాఖ్యానించడం తప్పు అని అన్నారు. అవే వ్యాఖ్యలు నందమూరి కుటుంబంపై ఎవరైనా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణపై కూడా స్పందించారు రోజా. ఆ హత్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని, నిందితుల్ని పట్టుకోవడంలో ఆనాడు చంద్రబాబు, పోలీసులు ఎందుకు ఫెయిలయ్యారని ప్రశ్నించారు.

First Published:  25 Jan 2023 7:31 AM GMT
Next Story