Telugu Global
Andhra Pradesh

అదంతా చానల్స్ ప్రచారమే- మంత్రి రోజా

''నేను రాజకీయాలకు దూరం అవడమా?'' అంటూ ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్నించారు రోజా. తన వాయిస్‌తో ఆడియో వైరల్‌పై.. ''ఎవరో చెప్పి ఉంటారు, ఎవరో ప్రచారం చేసి ఉంటారు.. నేనైతే ఆ ఆడియో వినలేదు'' అంటూ మాట్లాడేశారు.

అదంతా చానల్స్ ప్రచారమే- మంత్రి రోజా
X

నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న తనకు చెప్పకుండా వైసీపీ నేతలే భూమిపూజలు చేయడంపై ఇటీవల మంత్రి రోజా ఒక ఆడియోను విడుదల చేశారు. ఇలా అయితే తమలాంటి వారు రాజకీయాలు చేయడం చాలా కష్టమంటూ అందులో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి రోజా.. అబ్బే.. అదంతా చానల్స్ వాళ్ల ప్రచారం అంటూ తప్పించుకున్నారు.

''నేను రాజకీయాలకు దూరం అవడమా?'' అంటూ ఆశ్చర్యంగా ఎదురు ప్రశ్నించారు రోజా. తన వాయిస్‌తో ఆడియో వైరల్‌పై.. ''ఎవరో చెప్పి ఉంటారు, ఎవరో ప్రచారం చేసి ఉంటారు.. నేనైతే ఆ ఆడియో వినలేదు'' అంటూ మాట్లాడేశారు. తన నియోజకవర్గంలో అసమ్మతి అన్నది లేనే లేదని చెప్పారు. తనపై అసమ్మతి ఉన్నట్టుగా టీవీ చానల్లే ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. తాను ఇంట గెలిచి రచ్చ గెలిచిన వ్యక్తినని చెప్పారు.

2019 ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు .. నగరిలో ఎమ్మెల్యే గెలిచిన పార్టీ అధికారంలోకి రాదని.. జగన్‌ సీఎం కావాలనుకుంటే రోజాను ఓడించండి అని టీడీపీ వాళ్లే ప్రచారం చేశారని.. నగరిలో వరుసగా రెండుసార్లు ఏ వ్యక్తి గెలవరన్న నమ్మకం కూడా ఉండేదని.. ఆ రెండు నమ్మకాలను ఓడించిన వ్యక్తిని తానని రోజా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తనకు మధ్య గ్యాప్ తీసుకొచ్చామని కొందరు సంబరపడుతుంటారే గానీ.. అది సాధ్యం కాదన్నారు. తాను ఎప్పుడు ఇంటికి వెళ్లినా పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు సొంత కుటుంబసభ్యురాలిని చూసినట్టుగానే తననూ చూస్తారని చెప్పారు.

మంత్రి అయిన వెంటనే కోటిన్నర పెట్టి కారు కొనడంపై స్పందించిన రోజా.. తానేమీ పవన్‌ కల్యాణ్‌లాగా డ్రైవర్‌కు జీతం లేదు, డీజిల్‌కు డబ్బు లేదని ప్రచారం చేసుకునే వ్యక్తిని కాదని.. సినిమాల్లో, టీవీ షోల్లో, రాజకీయాల్లో ఉన్నత స్థానంలోనే తాను ఉంటూ వచ్చానని.. కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే కారు కొన్నానని వివరించారు.

రోజాకు నగరి టికెట్ రాని పరిస్థితే వస్తే.. ఇక రాష్ట్రంలో ఇప్పుడున్న వారెవరికీ వైసీపీ టికెట్ రానట్టే అని రోజా వ్యాఖ్యానించారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జనసేన కార్యకర్తలకు తాను మిడిల్ ఫింగర్‌ చూపానన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చానని.. దాన్ని అలా ప్రచారం చేశారని చెప్పారు. జనసేన కార్యకర్తలను పక్క పార్టీల జెండాలు మోసే కూలీలుగా పవన్‌ కల్యాణ్ మార్చేశారని రోజా విమర్శించారు.

First Published:  25 Oct 2022 3:03 AM GMT
Next Story