Telugu Global
Andhra Pradesh

బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటు రియాక్షన్

ఆ మాటలు వింటే.. ఆయన తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోదా, స్థాయిని బట్టి కాకుండా.. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలన్నారు రోజా.

బండారు వ్యాఖ్యలపై మంత్రి రోజా ఘాటు రియాక్షన్
X

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చట్టసభలకు వెళ్లిన ఓ వ్యక్తి, మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అని అన్నారు. ఆ మాటలు వింటే.. ఆయన తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోదా, స్థాయిని బట్టి కాకుండా.. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలన్నారు రోజా. మహిళలు స్వతంత్రంగా బతికేలా ఉండాలని, వారిని అవమానించడం నేరం అని చెప్పారు.

గాడ్సే కంటే ఘోరం బాబు..

చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకున్నారని మరోసారి మండిపడ్డారు మంత్రి రోజా. బాబు గాడ్సేకంటే ఘోరమైన వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు జీవితమే హింసా మార్గమని, గాంధీ జయంతి రోజున జైలులో ఆయన దీక్ష చేయడమంటే.. ఆ మహాత్ముడిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కంటే ఘోరం అని చంద్రబాబును ఉద్దేశించి గతంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు రోజా.

సభ్యులు కోటి.. మోగిన కంచాలు ఎన్ని?

టీడీపీకి కోటి సభ్యత్వం ఉందని ఆ పార్టీ నాయకులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారని, కానీ కంచాలు మోగించాలంటూ లోకేష్ ఇచ్చిన పిలుపుకి కనీసం ఎవరూ స్పందించలేదని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. టీడీపీ నాయకుల దొంగ నిరాహార దీక్షలను ప్రజలు నమ్మడం లేదని, వారిని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. 15 సీట్లలో పోటీ చేసేందుకు కూడా జనసేనకు అభ్యర్థులు లేరని కౌంటర్ ఇచ్చారు రోజా. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేయలేని పార్టీ టీడీపీ అని అన్నారు. సన్యాసీ, సన్యాసీ కలిస్తే బూడిద రాలుతుంది కానీ ఫలితం ఉండదన్నారు. టీడీపీ-జనసేన కలిసినా ఉపయోగం లేదన్నారు. 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని.. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే ఏపీలో జగన్ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ అని చెప్పారు రోజా.

First Published:  2 Oct 2023 9:31 AM GMT
Next Story