Telugu Global
Andhra Pradesh

నేను నీలా కాదు.. సినిమాల్లో, రాజకీయాల్లో సొంతంగా ఎదిగా..

షర్మిల చేసిన విమర్శలపై తాజాగా రోజా కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు సవాల్ విసురుతున్నానని.. తన కుటుంబ సభ్యులపై షర్మిల చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్నారు.

నేను నీలా కాదు.. సినిమాల్లో, రాజకీయాల్లో సొంతంగా ఎదిగా..
X

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల షర్మిల తనపై చేసిన విమర్శలకు రోజా ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదని, సొంతంగా సినిమాల్లో, రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తినని షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. షర్మిల నిన్న రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె రోజాపై తీవ్ర విమర్శలు చేశారు.

నగరికి రోజాతో సహా నలుగురు మంత్రులు ఉన్నారని.. వారంతా నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. రోజా, ఆమె ఇద్దరు అన్నలు, భర్త ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వేస్తున్నారని, స్థలాలు కబ్జాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, షర్మిల చేసిన విమర్శలపై తాజాగా రోజా కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు సవాల్ విసురుతున్నానని.. తన కుటుంబ సభ్యులపై షర్మిల చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపిస్తే తాము రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌న్నారు. `నీలాగా.. వైఎస్ఆర్ బిడ్డ అని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా.. నా సొంత కష్టంతో ఎవరి మద్దతు లేకుండా అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఎదిగాను' అంటూ షర్మిలకు రోజా ఘాటు కౌంటర్ ఇచ్చారు.

తాను మంత్రిగా ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటివరకు ఒక్క పదవి కూడా తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఎవరినీ బెదిరించి డబ్బు తీసుకోలేదన్నారు. నగరి తన సొంతూరు కాకపోయినా సినిమాలు వదులుకొని సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.

ఆడబిడ్డ అయిన తనకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారని అన్నారు. వైఎస్ఆర్ అత్యంత ప్రేమించే వ్యక్తిని నేనే..అని షర్మిల చేసిన వ్యాఖ్యలపై కూడా రోజా కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చేందుకు.. ఆయన పేరును చిరస్థాయిగా ప్రజల్లో నిలిపేందుకు జగన్ వైసీపీని స్థాపించారని రోజా చెప్పారు. జగన్ తన తండ్రి ఆశయాలు నెరవేరుస్తుంటే.. షర్మిల మాత్రం ఆయన ఆశయాలకు తూట్లు పొడిచేలా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారని రోజా తీవ్ర విమర్శలు చేశారు.

First Published:  12 Feb 2024 12:58 PM GMT
Next Story