Telugu Global
Andhra Pradesh

శవాల నోట్లో తులసి నీళ్లు.. టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు

2019 తర్వాత టీడీపీకి ఒక్క విజయం కూడా లేకపోవడంతో పిచ్చెక్కినట్టు అయిపోయారని, ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ సీట్లు రావడంతో అహంకారం నెత్తికెక్కిందని ఆరోపించారు.

శవాల నోట్లో తులసి నీళ్లు.. టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు
X

శవాల నోట్లో తులసి నీళ్లు పోసినట్టుగా టీడీపీ మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచిందని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. ఆ ఎమ్మెల్సీ సీట్లు కూడా సొంత ఓట్లతో గెలిచినవి కావన్నారు. టీడీపీ సింబల్ కూడా లేదన్నారు. అయినా పెద్ద ఘనకార్యం సాధించినట్టు టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదం అని చెప్పారామె. అధికారంలోకి వస్తామంటూ టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని సెటైర్లు వేశారు. ప్రజలేమో జగనన్న వన్స్ మోర్ అంటున్నారని చెప్పారు.

2019 తర్వాత టీడీపీకి ఒక్క విజయం కూడా లేకపోవడంతో పిచ్చెక్కినట్టు అయిపోయారని, ఇప్పుడు మూడు ఎమ్మెల్సీ సీట్లు రావడంతో అహంకారం నెత్తికెక్కిందని ఆరోపించారు. అందుకే అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి దాడి చేశారని, అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పారు రోజా. బీసీ కులానికి చెందిన స్పీకర్‌ ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చేసిన తప్పుని సమర్థించుకోవడానికి వైసీపీ నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటని అన్నారు.

ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా..?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల జాతి వాళ్లకు పదవులు ఇస్తారని చెప్పుకొచ్చారు రోజా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం దళితులను ముందు పెట్టి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. జీవో నెంబర్‌-1 రద్దుకోసం అసెంబ్లీలో తీర్మానం ఇచ్చిన టీడీపీ, ఎప్పుడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా? అని నిలదీశారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నెంబర్‌-1 తీసుకొచ్చామని వివరించారు. అలాంటి జీవో రద్దు అంటే ప్రజలను చంపడానికి అవకాశమివ్వడమే అని అన్నారు. 3 ఎమ్మెల్సీలు వస్తే ఏం జరగదని, టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు.

Next Story