Telugu Global
Andhra Pradesh

బోగస్ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుపు.. మంత్రి రోజా విమర్శలు

చంద్రబాబు దొంగ ఓట్లు అన్ని కుప్పం సమీపంలోని తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలవేనన్నారు. ఆ ఓట్లతోనే చంద్రబాబు సునాయాసంగా విజయం సాధించేవారని చెప్పారు.

బోగస్ ఓట్లతోనే కుప్పంలో చంద్రబాబు గెలుపు.. మంత్రి రోజా విమర్శలు
X

బోగస్ ఓట్లతోనే ఇన్నేళ్లు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారని ఏపీ మంత్రి రోజా విమ‌ర్శించారు. ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు కలిసి వచ్చినా వైసీపీని ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లు దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారన్నారు. దొంగ ఓట్లతోనే ఆయన మెజారిటీ సాధించ‌డంతో పాటు లోకల్ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటూ వచ్చారన్నారు. ఇటీవల కాలంలో కుప్పంలో బోగస్ ఓట్లను తొలగించినట్లు మంత్రి రోజా తెలిపారు. అందువల్లే ఎంపీ స్థానంలో టీడీపీ ఓటమిపాలైందన్నారు.

చంద్రబాబు దొంగ ఓట్లు అన్ని కుప్పం సమీపంలోని తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలవేనన్నారు. ఆ ఓట్లతోనే చంద్రబాబు సునాయాసంగా విజయం సాధించేవారని చెప్పారు. ఇప్పుడు ఆ దొంగ ఓట్లన్నీ తొలగించేసరికి టీడీపీ పరిస్థితి తలకిందులైందన్నారు. నారా లోకేష్ యువగళం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని, అది యువగళం కాదని.. తెలుగుదేశానికి మంగళం పాడే కాలం అని ఎద్దేవా చేశారు.

హైదరాబాద్ ని తానే కట్టానని చెప్పుకునే చంద్రబాబు హైదరాబాద్ లో జరిగిన ఎలక్షన్ల బాధ్యతను లోకేష్ కు అప్పగించగా.. అక్కడ పార్టీ నామరూపల్లేకుండా పోయిందన్నారు. ఆ తర్వాత కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు లోకేష్ కు అప్పజెప్పగా అక్కడ వైసీపీ విజయం సాధించిందని రోజా పేర్కొన్నారు.

ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి లోకేష్ తో పాదయాత్ర చేయిస్తున్నారని, ఇక టీడీపీకి మళ్లీ ఓటమి తప్పదన్నారు. ఇక జనసేన ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమం యువశక్తి కాదని, అది ముసలి శక్తి అని అందరికీ అర్థమైందన్నారు. ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని పదేపదే పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చాలు అన్నట్టు ప‌వ‌న్ వ్యవహరిస్తున్నారన్నారు. ఇది పవన్ వెనకాల ఉన్నవాళ్లు గమనించాలని మంత్రి రోజా సూచించారు.

First Published:  23 Jan 2023 7:01 AM GMT
Next Story