Telugu Global
Andhra Pradesh

విశాఖ అభివృద్ధి కాకూడ‌ద‌ని విషం చిమ్ముతున్నారు

రుషికొండ ఎదురుగా నారా లోకేశ్ తోడల్లుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే పవన్, బాబుల‌కు కనిపించదు.. అప్పుడు పవన్ నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ఏమైనా పెట్టుకున్నాడా..?

విశాఖ అభివృద్ధి కాకూడ‌ద‌ని విషం చిమ్ముతున్నారు
X

విశాఖ‌ప‌ట్నం అభివృద్ధి చెంద‌కూడ‌ద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, ప‌చ్చ మీడియా కంక‌ణం క‌ట్టుకున్నార‌ని మంత్రి రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. `మీరు ఎంత విషం చిమ్మినా విశాఖ రాజధానిని ఆపడం ఎవరి తరం కాదు.. రుషికొండలో నిర్మాణాలను ఆపలేరు..` అంటూ స్ప‌ష్టం చేశారు. హైకోర్టు అనుమతితోనే అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అనుమతి ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. మీరు సుప్రీంకోర్టు కంటే గొప్పవారు కాదు.. పవన్, చంద్రబాబును విశాఖ ప్రజలు తరిమి కొడతారు.. అంటూ హెచ్చ‌రించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చూసి ఓర్వలేక క్రైం సిటీగా భూతద్దంలో చూపిస్తున్నారని మండిప‌డ్డారు.

అన్నీ చట్టబద్దంగా జరుగుతున్నాయి..

రుషికొండ వద్ద నిర్మాణాలపై మంత్రి రోజా మరోసారి క్లారిటీ ఇచ్చారు. 'రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని నేను నిన్న‌నే వివరణ ఇచ్చాను. ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ప్రజలకు నిజాలను చెప్పలేదు. రుషికొండలో పర్యాటక శాఖకు ఉన్న 69 ఎకరాల‌కు గాను 9.17 ఎకరాల్లో అనుమతులు వస్తే 2.7 ఎకరాల్లో 4 నిర్మాణాలు చేస్తున్నాం. టూరిజం శాఖ తరఫున జీ ప్లస్ వన్ భవనాలు నిర్మిస్తున్నాం` అని వివ‌రించారు.

అప్పుడు హెరిటేజ్ ఐస్క్రీం తింటున్నావా పవన్..

రుషికొండ ఎదురుగా నారా లోకేశ్ తోడల్లుడు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే పవన్, బాబుల‌కు కనిపించదు.. అప్పుడు పవన్ నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ ఏమైనా పెట్టుకున్నాడా? అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. పవన్ ఊగిపోయి మాట్లాడుతున్నాడని, అత‌ని ప‌రిస్థితి చూస్తుంటే.. మెంటల్ ఆస్ప‌త్రిలో జాయిన్ అవుతాడనేది అర్థం అవుతోందని తెలిపారు.

ప‌చ్చ మీడియాది దిగజారుడు జర్నలిజం..

`ప్రభుత్వం తరఫున ఎవరు ఎక్కడ ఉండాలో చెప్పడానికి మీరు ఎవరు..?. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్ కల్యాణ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎల్లో మీడియా మొదటిపేజీలో రాస్తారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నేను నిన్న వాస్తవాలు మాట్లాడితే ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇదీ మీ దిగజారుడు జర్నలిజం..` అంటూ మంత్రి రోజా తీవ్రంగా విమ‌ర్శించారు.

First Published:  14 Aug 2023 2:10 AM GMT
Next Story