Telugu Global
Andhra Pradesh

ఇప్పుడు కుప్పం రంగు మారింది, రేపు జెండా మారుతుంది – మంత్రి రోజా

ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని, 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు మంత్రి రోజా.

ఇప్పుడు కుప్పం రంగు మారింది, రేపు జెండా మారుతుంది – మంత్రి రోజా
X

సీఎం జగన్ రాకతో కుప్పంలో పండగ వాతావరణం నెలకొందని అన్నారు మంత్రి రోజా. ఇది చంద్రబాబు గెలిచిన కుప్పం నియోజకవర్గమా, లేక జగన్ గెలిచిన పులివెందులా అనేది అర్థం కావడంలేదని చెప్పారు. కుప్పంకు నీళ్లివ్వలేని చంద్రబాబు పులివెందులకు ఇచ్చానని చెబితే నమ్మేవారు ఎవరూ లేరని అన్నారామె. జగన్ నిజంగానే టార్గెట్ చేయాలంటే చంద్రబాబు వెనకున్న 23 మంది ఎమ్మెల్యేలలో 22 మందిని లాగేసేవారని, కానీ ఆయన అలా అనుకోలేదని చెప్పారు. ఆయన నినాదాలు కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమేనన్నారు. కానీ చంద్రబాబు గతంలో జగన్‌ని టార్గెట్ చేశారని, కాంగ్రెస్‌తో కలసి కేసులు పెట్టించారని, అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని చూశారని విమర్శించారు రోజా.

2024 జగనన్న వన్స్ మోర్..

ట్వంటీ ట్వంటీ ఫోర్.. జగనన్న వన్స్ మోర్ అని ప్రజలు అంటున్నారని, 2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు మంత్రి రోజా. చంద్రబాబు లెక్క తేల్చేందుకే జగన్ ఇక్కడికి వచ్చారని, వచ్చే ఎన్నికల్లో తేల్చేస్తారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌.. మున్సిపల్ ఎన్నికల్లో వీధి వీధి తిరిగినా టీడీపీని ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయనిది, సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించారని చెప్పారు రోజా.

కుప్పం ప్రజలు సీఎం జగన్‌కి బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు కుప్పం రంగు మారిందని, రాబోయే ఎన్నికల్లో కుప్పం జెండా కూడా మారుతుందని అన్నారు మంత్రి రోజా. కుప్పం నుంచి కురుపాం వరకు.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎగిరేది వైసీపీ జెండాయేనని అన్నారు. సీఎం జగన్ పర్యటనతో చంద్రబాబులో భయం మొదలైందని, ఆయన ఈ సారి కుప్పం నుంచి పోటీ చేస్తారని తాము అనుకోవట్లేదని అన్నారు రోజా. చంద్రబాబు కుప్పం వదిలి పారిపోయే రోజు దగ్గర పడిందని ఎద్దేవా చేశారు.

Next Story